జీ20 రహస్య సమావేశానికి చైనా గైర్హాజరు !

Telugu Lo Computer
0


భారత్‌లో జరిగిన జీ20 రహస్య సమావేశానికి చైనా గైర్హాజరయ్యిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ వేదికగా జీ-20 రహస్య సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి పొరుగు దేశమైన చైనా దూరంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అరుణాచల్‌ ప్రదేశ్‌ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తోంది. అయితే చైనా వాదనలను భారత్‌ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అరుణాచల్‌ తమ దేశంలో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నగరం ఇటానగర్‌లో జరిగిన జీ-20 సమావేశాలకు చైనా దూరంగా ఉండటం చర్చనీయాశంగా మారింది. ప్రస్తుతం భారతదేశం G20 అధ్యక్ష వహిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని 50 ప్రధాన నగరాల్లో పలు పలు రంగాలు, అంశాలపై జీ-20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి చైనా ప్రతినిధులు హాజరుకాలేదని సమాచారం. ఈ సమావేశంపై చైనా అధికారికంగా భారత్‌కు నిరసన తెలియజేసిందా అనేది స్పష్టత లేదు. అయితే దీనిపై ఇటు భారత విదేశాంగ శాఖ గానీ.. అటు చైనా గానీ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. ఈ సమావేశాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మీడియా కవరేజ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. ‘పరిశోధన ఆవిష్కరణ చొరవ, సేకరణ’ అనే అంశంతో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఈ సమావేశాన్ని నిర్వహించింది. సమావేశానికి హాజరైన ప్రతినిధులు అరుణాచల్ ప్రదేశ్ శాసనసభను, ఇటానగర్‌లోని బౌద్ధ విహారాన్ని కూడా సందర్శించారు. అక్కడికి చేరుకున్న వారికి విమానాశ్రయంలో సాంస్కృతిక బృందాలు ఘనస్వాగతం పలికాయి. వారు స్థానిక వంటకాలను కూడా రుచి చూశారని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)