16 కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ !

Telugu Lo Computer
0


16 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన డేటాను చోరీ చేసి విక్రయించిన ముఠాను సైబరాబాద్ పోలీసులు  పట్టుకున్నారు. ఈ కేసులోని నిందితులను దేశవ్యాప్తంగా అదుపులోకి తీసుకుంటున్నారు. సైబరాబాద్ పరిధిలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మొత్తం 16 కోట్ల 8 లక్షల మంది డేటాను వీరు దొంగిలించారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న డేటా బ్రోకర్స్ పై విచారణ చేస్తామని, యూనిఫాం సర్వీసెస్ లో అత్యంత గోప్యంగా ఉంచాల్సిన వివరాలన్నీ చోరీ అయ్యయాని తెలిపారు. విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరి డేటా చోరీ అయ్యిందని, డేటాను గోప్యంగా ఉంచాల్సిన ఏజెన్సీలే బయటి వ్యక్తులకు అమ్ముకున్నాయని స్టీఫెన్ తెలిపారు. జస్ట్ డయల్ పై స్పెషల్ టీమ్స్‌తో దర్యాప్తు చేస్తామని చెప్పారు. సైబర్ క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందని, ఒకవేళ అవసరమనుకుంటే హోం శాఖ కు లేఖ రాస్తామన్నారు. బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకోవాలన్నా, క్రెడిట్‌ కార్డు పొందాలన్నా కేవైసీ ఎంతో కీలకమవుతోంది. ఈ కేవైసీ ద్వారానే డేటా చోరీ అయిందని పోలీసులు తెలిపారు. ఇటువంటి డేటాను బయటకు రాకుండా జాగ్రత్తగా ఉంచాల్సిన బాధ్యత బ్యాంకింగ్‌, టెలికాం సంస్థలపై ఉంటుందన్నారు. కేవలం వారి నిర్లక్ష్యం వల్లే వ్యక్తిగత సమాచారం చోరీ అవుతోందని సీపీ వివరించారు. చోరీ అయిన డేటా సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడుతోంది... ఆ నేరగాళ్లు తస్కరించిన డేటాను నేరాలకు ఉపయోగిస్తున్నారని, దీనివల్ల సైబర్‌ నేరాలు, ఇతర నేరాలు పెరగడంతో పాటు జాతీయ భద్రతకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)