'కౌ హగ్‌ డే' పిలుపు ఉపసంహరణ !

Telugu Lo Computer
0


ప్రపంచ ప్రేమికుల దినోత్సవంగా సెలబ్రేట్‌ చేసుకొనే ఫిబ్రవరి 14న 'కౌ హగ్‌ డే'గా జరుపుకోవాలంటూ ఇటీవల ఇచ్చిన పిలుపును కేంద్ర పశుసంవర్థక శాఖ పరిధిలోని యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా ఉపసంహరించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఈ పిలుపును వెనక్కి తీసుకొంటున్నట్టు భారత జంతు సంరక్షణ బోర్డు  కార్యదర్శి ఎస్‌కే దత్తా ఓ నోటీసులో పేర్కొన్నారు. దేశంలోని గోవులను ప్రేమించేవారు ఫిబ్రవరి 14న 'కౌ హగ్ డే'ని జరుపుకోవాలంటూ తొలిసారి యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో మన పురాతన సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని.. గోమాత ప్రాధాన్యతను గుర్తించి ఫిబ్రవరి 14న గోవులను ఆలింగనం చేసుకోవాలంటూ జంతు సంరక్షణ బోర్డు ఇటీవల తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆవులు మన దేశ సంస్కృతీ సంప్రదాయాలకు, గ్రామీణ ఆర్థిక వ్యస్థకు వెన్నెముకగా పేర్కొన్న బోర్డు, అలాంటి గోవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా దేహంలోకి పాజిటివ్‌ ఎనర్జీ ప్రవహించడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపింది. అందువల్ల గో ప్రేమికులంతా 'కౌ హగ్‌ డే'ను జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే, ఇదే అంశంపై గురువారం మాట్లాడిన కేంద్ర మత్స్య,పశుసంవర్థక శాఖ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా.. బోర్డు ఇచ్చిన పిలుపుతో ప్రజలు సానుకూలంగా స్పందిస్తే మంచిదేనన్నారు. ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు 'కౌ హగ్‌ డే' పాటించాలంటూ ఇచ్చిన పిలుపును తాజాగా ఉపసంహరించుకోవడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)