కొత్త తరహాలో రెస్టారెంట్‌ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో జాతీయ రహదారి పక్కన కొత్త తరహా రెస్టారెంట్‌ ఆకట్టుకుంటోంది. 'గుఫూ' పేరుతో రెస్టారెంట్‌ ఏర్పాటు చేసిన నిర్వాహకులు వివిధ రకాల వాహనాల ఇంటీరియర్‌తో తీర్చిదిద్దారు. విజయవాడకు చెందిన కృష్ణ ప్రసాద్‌ కుటుంబానికి దశాబ్దాల నుంచే లారీలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం మోటారు వాహనాల రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. తన కుమారుడు విజయ్‌ కుమార్‌ను మోటారు ఫీల్డ్‌లోకి తీసుకురావటం తండ్రికి ఇష్టంలేదు. దీంతో హోటల్‌ వ్యాపారంలోకి రావాలనుకున్నారు. మామూలు రెస్టారెంట్‌ కాకుండా మోటారు వాహనాల థీమ్‌తో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచనకు వచ్చారు. ఆ మేరకు రెస్టారెంట్‌ ముందు భాగాన్ని లారీ క్యాబిన్‌తో తీర్చి దిద్దారు. సీటింగ్‌, వాష్‌ బేసిన్‌, టేబుల్స్‌ వంటివి కూడా వాహనాల రూపు రేఖల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పెట్రోల్‌ పంప్‌ తరహాలో బీరువా, సైకిల్‌ మీద హ్యాండ్‌ వాష్‌ ఇలా వేటికవే ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రెస్టారెంట్‌ పేరు వెనుక కూడా ఓ కథ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. 'గుఫూ' అనేది ఓ ఫిక్షనల్‌ క్యారెక్టర్‌ అని తెలిపారు. గుఫూ తండ్రి పంజాబీ, తల్లి ఆంధ్రా కావటంతో ఈ రెండు రకాల వంటకాలను తమ వద్ద అందుబాటులో ఉంచినట్టు వివరించారు. ప్రత్యేక లంచ్‌ బాక్స్‌లో వంటకాలను తెచ్చి వినియోగదారులకు వడ్డిస్తున్నారు. ఇక్కడకు వస్తున్న వినియోగదారులు కూడా రెస్టారెంట్ పరిసరాల్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ తరహా రెస్టారెంట్ చూడలేదని, ఇది కొత్త తరహాలో చాలా బాగుందని అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)