కేంద్రంపై జస్టిస్ నారిమన్ ఆగ్రహం !

Telugu Lo Computer
0


ముంబై విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రొహింటన్ ఫాలి నారిమన్ మాట్లాడుతూ, స్వతంత్ర, నిర్భయ న్యాయమూర్తుల నియామకం జరగకపోతే న్యాయ వ్యవస్థకు స్వతంత్రత ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ''ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే, దానికి ఆ ఉప్పదనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి?'' అని సామాన్యుడు ప్రశ్నించుకుంటాడన్నారు. న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫారసుపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే, ఇక దానికి స్పందించడానికేమీ లేదని భావించి, ఆ సిఫారసును తాను అమలు చేసే విధంగా ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఓ తీర్పును ఇవ్వాలని పిలుపునిచ్చారు. సిఫారసులపై స్పందించకుండా కూర్చోవడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని చెప్పారు. ''ఫలానా కొలీజియం రావాలని, అది వస్తే దాని మనసు మార్చుకుంటుందని మీరు ఎదురు చూస్తున్నారు'' అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. సమంజసమైన సమయంలో న్యాయమూర్తుల నియామకం తప్పనిసరిగా జరగాలన్నారు. జస్టిస్ నారిమన్ జడ్జిగా తన పదవీ విరమణ వరకు సుప్రీంకోర్టు కొలీజియం సభ్యునిగా ఉన్నారు. కిరణ్ రిజిజు ఇటీవల అనేక సందర్భాల్లో కొలీజియం వ్యవస్థపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ కూడా ఇదేవిధంగా స్పందించారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం పార్లమెంటరీ సార్వభౌమాధికారానికి తీవ్ర విఘాతమని ఆరోపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)