ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన

Telugu Lo Computer
0


ఢిల్లీ అసెంబ్లీ మూడు రోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. వాయు కాలుష్యాన్ని నిరోధించడంలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ఆరోపిస్తూ ఆ పార్టీ విపక్ష నేత విజేందర్ గుప్తా, రామ్‌వీర్ సింగ్ బిడ్గురి, ఓపీ శర్మ, అభయ్ వర్మ తదితరులు చేతిలో ఆక్సిజన్ సిలెండర్లు, ముఖానికి ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ''గ్యాస్ ఛాంబర్‌లో బతుకు భయంతో కాలం గడుపుతున్న రెండు కోట్ల మంది ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించబోతున్నాను. కాలుష్య రహిత రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలోమిటే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'' అని విజేందర్ గుప్తా ఒక ట్వీట్‌లో అన్నారు. ఢిల్లీని పొగ చుట్టుముట్టిందని, ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ జబ్బుల బారిన పడుతున్నారని, చేతకాని ఆప్ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోందని ఆయన విమర్శించారు. సిలెండర్లు తీసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలను స్పీకర్ నివాస్ గోయెల్ మందలించారు. సిలెండర్లు దూరంగా పెట్టి రావాలన్నారు. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లున్నప్పటికీ సిలెండర్లను ఎలా తీసుకువచ్చారని వారిని ప్రశ్నించారు. సెక్యూరిటీ సిబ్బంది తన ఛాంబర్‌కు వచ్చి కలవాలని కూడా ఆయన ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)