తెలంగాణలో బ్యాటరీల తయారీ కంపెనీ పెట్టుబడులు !

Telugu Lo Computer
0


స్విట్లర్జాండ్‌లోని దావోస్‌ నగరంలో జరుగుతోన్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బృందం పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక విధానాన్ని వివరిస్తూ కేటీఆర్‌ టీమ్‌ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఓ ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు ఈ తయారీ కేంద్రంలో ఉత్పత్తి అవుతాయి. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కే.తారక రామారావు సమక్షంలో అలాక్స్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో తొలుత 210 కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గిగా వాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామని అలాక్స్ తెలిపింది. ఈ సామర్థ్యాన్ని భవిష్యత్తులో పది గిగావాట్లకు పెంచుతామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2030 నాటికి మొత్తంగా రూ. 750 కోట్ల రూపాయలను ఈ కేంద్రంపై పెట్టుబడిగా పెడతామన్నారు. ప్రతిపాదిత తయారీ కేంద్రంతో సుమారు 600 మంది అత్యుత్తమ నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని అలాక్స్ తెలిపింది. తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు అలాక్స్ సంస్థ ముందుకు రావడం పట్ల మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు రాష్ట్రంలో తయారీ ఈకో సిస్టంను పెంచేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ -అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ కీలకంగా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2020 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వెహికల్, ఈ ఎస్ ఎస్ పాలసీని తీసుకొచ్చిందన్న కేటీఆర్, ఇలాంటి ప్రత్యేక పాలసీని దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ప్రభుత్వం తమదేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణమేనని అలాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య సుంకవల్లి స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)