బెదిరింపులతో పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి !

Telugu Lo Computer
0


పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి బెదిరింపులు వస్తున్నాయని, దీంతో వ్యాపారస్తులు తమ పెట్టుబడుల్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి జరిగిన ఓ సంఘటనను ఆయన తాజాగా ప్రస్తావించారు. రాష్ట్రంలో రూ. 6,000 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్న ఓ వ్యాపారికి గత ఏడాది బెదిరింపులు కాల్స్ రావడంతో తన ప్రాజెక్ట్‌ను కర్ణాటకకు మార్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన, పారిశ్రామికవేత్తలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పారిశ్రామిక రంగంలోకి రాజకీయాలు తీసుకురావద్దని నేతలకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలకు ఆసరాగా డబ్బులు దండుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “మధ్యాహ్నం ఒక పెట్టుబడిదారుడు నన్ను కలిసి, ఒక సంవత్సరం క్రితం ఇక్కడ  ₹ 6,000 కోట్లు పెట్టుబడి పెట్టాలనుకున్నట్లు చెప్పాడు. కానీ అతడికి బెదిరింపు కాల్స్ రావడంతో మహారాష్ట్రలో నుంచి విరమించుకుని కర్ణాటకలో పెట్టుబడి పెట్టినట్లు చెప్పాడు. ఇది విని నేను చాలా బాధపడ్డాను” అని ఫడ్నవీస్ చెప్పారు. ఇదే పరిస్థితి నెలకొంటే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రావని ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇలాంటి పోకడలను అణచివేయాలని సూచించారు. సంస్థ, సంఘం, మతం వంటివి పట్టించుకోకుండా, పార్టీలకు అతీతంగా ఇలాంటి ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. '’మహారాష్ట్రలో భారీగా మానవ వనరులు ఉన్నందున పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. రాజకీయాలను పరిశ్రమల్లోకి తీసుకురావద్దని నాయకులందరినీ కోరుతున్నాను. కూలీలకు రక్షణ కల్పించాలి కానీ కొందరు రాజకీయ నాయకులు కూలీల భుజాలను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. నేను చర్య తీసుకోవడానికి వెనుకాడను" అని ఆయన హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)