రేపే దావోస్‌ లో ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్

Telugu Lo Computer
0


జనవరి 16 నుంచి 20 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి ప్రపంచంలోని ముఖ్యనేతలతో పాటు పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ, వ్యాపార నాయకులు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ థీమ్‌ ‘విచ్ఛిన్నమైన ప్రపంచానికి సహకారం’ అని నిర్ణయించారు. ఈ సమ్మిట్‌లో ప్రపంచం ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం, ప్రపంచ ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పు వంటి కొన్ని ముఖ్యమైన సమస్యలను చర్చించనున్నారు. ఈ సమ్మిట్‌ వినూత్న పరిష్కారాలను ప్రోత్సహించనున్నారు. ఈ సమ్మిట్‌కు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్, యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెట్సోలా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ ఎం రామఫోసా, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్, స్విస్ ప్రెసిడెంట్ అలైన్ బెర్సెట్, ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్‌తో పాటు పలువురు ప్రపంచ నేతలు పాల్గొననున్నారు. భారత్‌ నుంచి కూడా పలువురు నేతలు ఈ సమ్మిట్‌లో భాగస్వామ్యం కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవియా, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్ హాజరుకానుండగా, ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, బిఎస్ బొమ్మై, యోగి ఆదిత్యనాథ్ సభకు హాజరవుతారని సమాచారం. వీరే కాకుండా టాటా సన్స్ ఇండియా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథ్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వంటి పారిశ్రామిక వేత్తలు కూడా పాల్గొననున్నారు. బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజూ రవీంద్రన్, పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా, ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ కుమార్ ఖరా ఈ సమావేశానికి హాజరవుతారని సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)