నకిలీ నోట్ల చలామణి కేసులో రజని అరెస్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్‌ డైరెక్టరుగా పని చేస్తున్న రసపుత్ర రజనిని నకిలీ నోట్ల చలామణి కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా ముఖ్య నేతలతో ఉన్న పరిచయాలు, కార్పొరేషన్‌ పదవిని అడ్డంపెట్టుకుని ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. ప్రొద్దుటూరుకు చెందిన చరణ్‌సింగ్‌తో పాటు రజనిని సుబ్రహ్మణ్యపుర ఠాణా పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈమె ప్రొద్దుటూరులో వైకాపాలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అండదండలతో కార్పొరేషన్‌ డైరెక్టరు పదవి దక్కించుకున్నారు. ఇటీవల పదవీకాలం ముగియడంతో తిరిగి పదవిని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమె వద్ద రూ.44 లక్షల విలువగల రూ.500 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో తమకు పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి ఈ నోట్లను తక్కువకు కొని బెంగళూరులో చలామణిలోకి తీసుకొస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు అనుచరురాలిగా ఉన్న ఈ మహిళా నేత, దొంగనోట్ల కేసులో పోలీసులకు చిక్కడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈమె 2017లో ప్రొద్దుటూరులో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి ఐపీ పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం లోని పలువురు పెద్దలతో ఫొటోలు దిగి, వాటిని నిరుద్యోగులకు చూపించి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇటీవల వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరు, దువ్వూరు తదితర ప్రాంతాల్లో దొంగనోట్ల చలామణి ఎక్కువగా సాగింది. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న పలువురు నిందితులను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో జరిగిన నకిలీ నోట్ల చలామణి వ్యవహారంలో కూడా రజని పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కర్ణాటక పోలీసులు సైతం ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)