జోషీమఠ్‌పై అమిత్‌షా సమీక్ష !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ లోని జోషీమఠ్‌కి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం సమీక్ష నిర్వహించారు. కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, ఆర్‌కే సింగ్‌, భుపేంద్ర యాదవ్‌, గజేంద్ర షెకావత్‌, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాదకరంగా మారిన భవనాల తొలగింపు, ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపు ప్రధాన అంశాలుగా చర్చించారు. మరోవైపు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న హోటల్‌ మలర్‌, మౌంట్‌ వ్యూ భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ అధికారులు, సదరు యజమానులు ఒప్పందానికి రావడంతో గురువారం ఈ పని ప్రారంభించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఢీల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇదే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ఉత్తరాఖండ్‌ హైకోర్టు శాశ్వత పరిష్కారానికి పటిష్ఠ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి, ఆ నివేదికను రెండు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.1.50 లక్షల చొప్పున గురువారం సాయంత్రానికి లేదా శుక్రవారం అందుతాయని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ తెలిపారు. జోషీమఠ్‌లో పలు సైనిక భవనాలూ దెబ్బతినడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. జోషీమఠ్‌, దాని పరిసర ప్రాంతాల నుంచి బలగాలను తరలించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)