సూసైడ్ ప్లాంట్ !

Telugu Lo Computer
0

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్క జింపి - జింపి . దీని శాస్త్రీయ నామం డెండ్రోక్నైడ్ మోరోయిడ్స్. ఆస్ట్రేలియాలోని ఈశాన్య వర్షారణ్యాలలో కనుగొనబడింది. చూడటానికి సాధారణ మొక్కలాగే ఉండే ఈ ప్లాంట్ ఎంత డేంజర్ అంటే దీన్ని తాకినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. దానిలో పాముకు ఉన్నంత విషం ఉంటుంది. ఆస్ట్రేలియన్ మూలానికి చెందిన ఈ మొక్కను పొరపాటున ఎవరి శరీరమైనా తాకినట్లయితే, ఆ మొక్కలోని వెంట్రుకలు బలంగా గుచ్చుకుంటాయి. మేకుల్లా శరీరంలోకి దిగుతాయి. దీంతో ఎంత దారుణమైన నొప్పి కలుగుతుందంటే దాన్ని తట్టుకోలేక ఆ వ్యక్తికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. అందుకే ఈ మొక్కకు “సూసైడ్ ప్లాంట్” అనే పేరు వచ్చింది. సినిమా ఫక్కీ లో దీని బండారం బయట పడింది. మెరీనా హర్లీ అనే శాస్త్రవేత్త కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియన్ వర్షారణ్యాలపై పరిశోధనలకు వెళ్లారు. సైంటిస్టు అయిన ఆమెకు అడవుల్లో చాలా ప్రమాదాలు ఉంటాయని తెలుసు. కొన్ని చెట్లు , మొక్కలు విషపూరితంగా ఉంటాయనే అవగాహన కూడా ఆమెకు ఉంది. అందుకే ఆమె చేతులకు గ్లోవ్స్, బాడీ సూట్ ధరించి అడవికి వెళ్లారు. విభిన్నంగా కనిపించే చెట్లూ, మొక్కల మధ్య తిరిగారు. కానీ ఒక మొక్కను మెరీనా హర్లీ తాకగానే యాసిడ్ పోసినంత, విద్యుత్ షాక్ కొట్టినంత నొప్పి కలిగింది. ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఆమె శరీరం మొత్తం ఎర్రగా మారింది. నొప్పి బాధతో కేకలు పెట్టింది. ఇది జింపి – జింపి మొక్క ప్రభావం. దీనివల్ల చాలా కాలం పాటు ఆమె ఆసుపత్రిలో స్టెరాయిడ్లను తీసుకోవలసి వచ్చింది. డిస్కవరీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రవేత్త మెరీనా హర్లీ మాట్లాడుతూ ఈ నొప్పి ఎవరికైనా విద్యుత్ షాక్ ఇవ్వడం, పై నుండి యాసిడ్ పోయడం లాంటిదని చెప్పారు. జింపి – జింపి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మొక్క. క్వీన్స్‌లాండ్‌లోనిరెయిన్‌ ఫారెస్ట్‌లో పనిచేసే వారు లేదా కలపను కత్తిరించే వారు ఆ మొక్కను మరణానికి మరో పేరుగా భావిస్తారు. ఈ మొక్క విషయం తెలిసిన తర్వాత అడవులకు వెళ్లే వారు రెస్పిరేటర్లు, మెటల్ గ్లోవ్స్, యాంటిహిస్టామైన్ మాత్రలు (అలెర్జీ మరియు పెయిన్ కిల్లర్స్) తమ వెంట తీసుకెళ్లడం ప్రారంభించారు. జింపి – జింపి మొక్క మొదటిసారిగా 1866 సంవత్సరంలో గుర్తించబడింది. ఆ టైంలో అడవుల మీదుగా వెళుతున్న చాలా జంతువులు, ముఖ్యంగా గుర్రాలు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ చనిపోవడం ప్రారంభించాయి. అందరూ ఒకే మార్గం గుండా వెళుతున్నారని, ఒకే మొక్క వాళ్ళను తాకిందని తదనంతర దర్యాప్తులో తేలింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చాలా మంది ఆర్మీ అధికారులు కూడా దీని బారిన పడ్డారు. జింపి – జింపి మొక్క ప్రభావంతో సంవత్సరాల తరబడి నొప్పిని ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ పార్క్స్, వైల్డ్‌లైఫ్ సర్వీస్ అటవీ సందర్శకులను ఈ మొక్క నుంచి రక్షించేందుకు ఒక గైడ్‌ను తీసుకువచ్చింది. ఈ మొక్క ఆకులు గుండె ఆకారంలో ఉంటాయి. ఎత్తు 3 నుండి 15 అడుగుల వరకు ఉంటుంది. దీనికి చక్కటి జుట్టు లాంటి ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్లలో న్యూరోటాక్సిన్ పాయిజన్ ఉంటుంది. ఈ ముళ్ళ ద్వారా మన శరీరంలోకి విషం చేరుతుంది. ఈ విషం నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మరణానికి కూడా దారి తీయొచ్చు. ముల్లు గుచ్చుకున్న అరగంట తర్వాత, నొప్పి తీవ్రత పెరగడం ప్రారంభమవుతుంది. తక్షణ చికిత్స అందించకపోతే నొప్పి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ ముల్లును తొలగించే సమయంలో విరిగిపోయి చర్మంలోనే ఉండిపోతే, అప్పుడు మన శరీరంలో విషం మరింత పెరుగుతుంది. ఈ మొక్క యొక్క విషాన్ని రసాయన ఆయుధంగా ఉపయోగించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయాన్ని కూడా సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ మొక్కను పూర్తిగా తొలగించడం పర్యావరణ వ్యవస్థకు మంచిది కాదు. ఇందులో ఒక మంచి విషయం ఏమిటంటే, అడవిలోని అనేక కీటకాలు , పక్షులు దాని పండ్లను తిని జీవిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)