త్వరలో అందుబాటులోకి రానున్న ఏకే-200 సిరీస్ అసాల్ట్ రైఫిల్స్ !

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీలో ఇండో-రష్యన్ జాయింట్ వెంచర్ తో ఏకే-200 సిరీస్ అసాల్ట్ రైఫిల్స్  ఉత్పత్తి చేస్తోంది. ఇవి మార్చినాటికి భారత సైన్యానికి అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో భారతీయ దళాల పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది. రష్యాకు చెందిన రోస్‌టెక్ స్టేట్ కార్పొరేషన్ అనుబంధ సంస్థలు రోసోబోరోన్‌ఎక్స్‌పోర్ట్, కలష్నికోవ్ కన్సర్న్ భారత దేశంతో ఒప్పందం చేసుకుని ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 7.62 ఎంఎం ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్‌ను తయారు చేస్తున్నాయి. మొదటి బ్యాచ్ రైఫిల్స్ ఉత్పత్తి ఈ నెల 17న జరిగింది. వేర్వేరు పరిస్థితుల్లో సమర్థవంతంగా ఉపయోగించేందుకు వీలుగా వీటిని తయారు చేశారు. నూటికి నూరు శాతం స్థానికంగానే వీటిని ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు. రోస్టెక్ స్టేట్ కార్పొరేషన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది. భారత్, రష్యాల మధ్య సైనిక, సాంకేతిక రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా ఈ జాయింట్ వెంచర్‌ ఏర్పాటైనట్లు తెలిపింది. ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ రాకతో భారత దేశ రక్షణ, చట్టాన్ని అమలు చేసే సంస్థల్లోకి అత్యంత నాణ్యమైన, సౌకర్యవంతమైన, ఆధునిక చిన్న ఆయుధాలు ప్రవేశిస్తాయని పేర్కొంది. ఏకే-203అసాల్ట్ రైఫిల్స్ పనితీరు అద్భుతంగా ఉంటుందని రోస్టెక్ జనరల్ డైరెక్టర్ సెర్గీ చెమెజోవ్ చెప్పారని ఈ ప్రకటన పేర్కొంది. వేర్వేరు షూటర్లకు తగినట్లుగా దీనిని రూపొందించినట్లు, ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ అజాల్ట్ రైఫిల్ అని చెప్పినట్లు తెలిపింది. రోసోబోరోన్ఎక్స్‌పోర్ట్ డైరెక్టర్ జనరల్ అలగ్జాండర్ మిఖీవ్ మాట్లాడుతూ, భారత దేశంలోని పోలీసులు, చట్టాన్ని అమలు చేసే ఇతర సంస్థలకు అవసరమైన అసాల్ట్ రైఫిల్స్‌ను సంపూర్ణంగా అందజేసే సామర్థ్యం కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఉందన్నారు. ఇతర దేశాలకు వీటిని ఎగుమతి చేసే సామర్థ్యం కూడా తమ జాయింట్ వెంచర్‌కు ఉందన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)