వైజాగ్ స్టీల్ టేకోవర్ కు అదానీకా, పోస్కోకా ?

Telugu Lo Computer
0


వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుని ఏడాది దాటిపోయింది. దీంతో ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆ లోపు ప్రైవేటీకరణ ఆపాలంటూ జరుగుతున్న ఉద్యమాలు, నిరసనలు, పార్లమెంటులో రాష్ట్ర ఎంపీలు చేస్తున్న ఒత్తిడి ఫలించేలా కనిపించడం లేదు. తాజాగా పెట్టుబడుల ఉపసంహరణ కోసం విధివిధానాల ఖరారు కోసం ప్రయత్నిస్తున్న కేంద్రం, మరోవైపు ఎప్పటికప్పుడు విశాఖ కలెక్టర్ నుంచి సమాచారం తెప్పించుకుంటూ బిడ్లకు రంగం సిద్ధం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలతో స్టీల్ దిగ్గజాల చూపు ఇప్పుడు బిడ్డింగ్ పైనే నెలకొంది. దేశీయ సంస్ధలైన అదానీ, పోస్కోతో పాటు పలు విదేశీ దిగ్గజాలు స్టీల్ ప్లాంట్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద తమకున్న పలుకుబడితో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్ధితుల్లో స్టీల్ ప్లాంట్ ను దక్కించుకుంటే భవిష్యత్తులో భారీ లాభాలు ఆర్జించే అవకాశం ఉండటంతో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు స్టీల్ దిగ్గజాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రానికీ కాసుల పంట ఖాయంగా చెప్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా పెట్టుబడుల విధివిధానాలు ఖరారు కాగానే బిడ్డింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు మొదలవుతాయి. ఈ ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ ను చేజిక్కించుకునేందుకు అదానీ, పోస్కోతో పాటు నిప్పన్ స్టీల్, ఎస్సార్ స్టీల్ వంటి దిగ్గజాలు పోటీపడుతున్నా.. అంతిమంగా అదానీ, పోస్కోల్లో ఒకరికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విశాఖ పక్కనే ఉన్న గంగవరం పోర్టును దక్కించుకున్న అదానీకి వైజాగ్ స్టీల్ కూడా కట్టబెట్టవచ్చనే వాదన ఉంది. అయితే ఒడిశాలో స్టీల్ ప్లాంట్ స్ధాపన కోసం చివరి వరకూ ప్రయత్నించి విఫలమైన పోస్కో నుంచి అదానీకి గట్టిపోటీ తప్పేలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న మద్దతుతో అదానీ వైజాగ్ స్టీల్ కొనుగోలు చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)