తిరిగి కాంగ్రెస్‌లోకి గులాం నబీ ఆజాద్‌ ?

Telugu Lo Computer
0


డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్‌ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించి రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కోగలిగేది కాంగ్రెస్ ఒక్కటేనని, తాను కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం కాదని, పార్టీ వ్యవస్థలో ఉన్న లోపాలతో మాత్రమే విభేదిస్తున్నానంటూ ఆజాద్ వ్యాఖ్యానించడంతో అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. దీంతో భారత్ జోడో యాత్రకు రావాలంటూ దిగ్విజయ్ సింగ్ ఆయనకు ఆహ్వానం కూడా పంపారు. జీ23 అసమ్మతి నేతల్లో ఉన్న బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్, హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు భూపిందర్ సింగ్ హుడా నేరుగా గులాం నబీ ఆజాద్‌ను కలిసి ఆహ్వానం పలికారు. ఆజాద్ క్యాంప్ నుంచి కూడా నేతలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి వెళ్లారు. అతి త్వరలో భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించనుంది. ఆ సమయంలో గులాం నబీ ఆజాద్ తన పార్టీ క్యాడర్‌తో యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు అంబికా సోని కూడా ఆజాద్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీని వీడేటప్పుడు గులాం నబీ ఆజాద్ రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు పరిపక్వత లేదని, ఆయన వ్యక్తిగత సహాయకులే పార్టీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. తనలాంటి అనుభవం ఉన్న సీనియర్ నేతలను పక్కన పెట్టేస్తున్నారని విమర్శించారు. పార్టీలో సంప్రదింపుల విధానాన్ని రాహుల్ తుంగలో తొక్కారని, ఏ మాత్రం అనుభవం లేని భజనపరులతో కొత్త కోటరీ వచ్చిందని ఆజాద్ విమర్శించారు. 52 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేసిన ఆజాద్‌.. ఆగస్టు 26న ఆ పార్టీ వీడారు. తమ డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాల మీద నిర్మితమైందని చెప్పారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ సిద్ధాంతాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీలోని ఆజాద్‌కు, తన పేరుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)