మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని హన్మకొండ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకులు మందాడి సత్యనారాయణరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మందాడి మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం తెలిపారు. సత్యనారాయణ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.  కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మందాడి కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. బీజేపీ బలోపేతానికి మందాడి కృషి మరవలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణరెడ్డి క్రియాశీల పాత్ర పోషించారని, ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో స్వరాష్ట్ర సాధనకోసం అసెంబ్లీలో తనదైన శైలిలో గళం వినిపించారని సంజయ్ గుర్తుచేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, పలు పార్టీల నేతలు మందాడి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు. బీజేపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మందాడి సత్యనారాయణ రెడ్డి ఆ పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీని వీడిన మందాడి టీఆర్ఎస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో నాటి హన్మకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మందాడి విజయం సాధించారు. 2009 ఎన్నికల ముందు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత ఆయన ఎన్నికల్లో పోటీచేయలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)