తమిళనాడులో వర్ష బీభత్సం

Telugu Lo Computer
0


ఈశాన్య రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.  తాజాగా 14 జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ఈ వర్షాలు 6వ తేదీ వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. చెన్నై నగరంలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శ్రీలంక నుంచి పశ్చిమ తమిళనాడు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. మంగళ, బుధవారం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, రాణిపేట సహా ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధిక శాతంగా తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌ ప్రాంతంలో 13 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శివగంగై, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుదురై, పుదుకోట్టై, కన్యాకుమారి, నీలగిరి, కోయంబత్తూరు తదితర 17 జిల్లాల్లో వరుణ బీభత్సం కొనసాగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)