యాదాద్రిలో రికార్డు స్థాయి ఆదాయం !

Telugu Lo Computer
0


యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి, వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వీఐపీ దర్శనం కోసం రూ.150 టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులు తూర్పు రాజగోపురం నుంచి పడమటి రాజగోపురం వరకు క్యూకట్టారు. నిన్న ఒక్కరోజే యాదాద్రీశుడికి రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. వివిధ సేవలు, కౌంటరు విభాగాల ద్వారా రూ.1,09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ఇప్పటి వరకు యాదాద్రి చరిత్రలో రూ.కోటి మించి ఆదాయం రాలేదు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,000, వీఐపీ దర్శనం టికెట్లకు రూ.22,62,000, వ్రతాల ద్వారా రూ.13,44,000, కొండపైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50,000, బ్రేక్‌ దర్శనం టికెట్ల ద్వారా రూ.6,95,000 సహా వివిధ సేవల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్టు వెల్లడించారు.యాదాద్రిని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తోడు కార్తిక మాసం కావడంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఈ క్రమంలో రూ.కోటికి పైగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)