పోస్టాఫీసు ఖాతాదారులకు పెరిగిన వడ్డీ రేట్లు

Telugu Lo Computer
0


చిన్న పొదుపు పథకాల లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. తాజాగా పెరిగిన వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. రెండేళ్లు, మూడేళ్ల కాల వ్యవధి డిపాజిట్లు, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ , కిసాన్ వికాస్ పత్ర, పోస్ట్ ఆఫీస్ మంథ్లీ ఇన్‌కమ్ అకౌంట్ వంటివి స్మాల్ సేవింగ్ స్కీమ్ జాబితాలోకి వస్తాయి. పోస్టాఫీసుల్లో ఈ చిన్న పొదుపు స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ మే నుంచి కీలక రెపో రేట్లను వరుసగా పెంచుతోంది. దీంతో బ్యాంకులతో పాటు పోస్టాఫీసులు కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. మొత్తానికి 9 త్రైమాసికాల తర్వాత కేంద్రప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను పెంచింది.  చివరగా 2020-21 మొదటి త్రైమాసికంలో వడ్డీ రేట్లు సవరించి, తగ్గించిన విషయం తెలిసిందే. తాజా వడ్డీ రేట్లు చెక్ చేద్దాం. అందులో మొదటిది కిసాన్ వికాస్ పత్ర, కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌కు సంబంధించి కాల వ్యవధి, వడ్డీ రేట్‌ను సవరించింది. గతంలో కేవీపీ వడ్డీ రేటు 6.9 శాతంగా ఉండగా ప్రస్తుతం దీన్ని 7 శాతానికి పెంచింది. ఇక కాల వ్యవధి గతంలో 124 నెలులు కాగా, ఇప్పుడు 123 నెలలకే కుదించారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీని 20 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో తాజా వడ్డీ రేటు 7.6 శాతానికి పెరిగింది. కాగా, ఇది గతంలో 7.4 శాతంగా ఉండేది. నెలవారీ ఆదాయ పథకంపై ప్రస్తుతం 10 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ పెంచారు. దీంతో తాజా వడ్డీ రేటు 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది.  రెండు సంవత్సరాల టైమ్ డిపాజిట్లపై తాజాగా కేంద్ర ప్రభుత్వం 20 బేసిస్ పాయింట్లు వడ్డీ పెంచడంతో వడ్డీ రేటు 5.7 శాతానికి పెరిగింది. కాగా, గతంలో ఇది 5.5శాతంగా ఉండేది. ఇక మూడు సంవత్సరాల టైమ్ డిపాజిట్లపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 30 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో వడ్డీ రేటు 5.5 శాతం నుంచి 5.8 శాతానికి పెరిగింది. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. అలాగే పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్, వన్ ఇయర్ టైమ్ డిపాజిట్, ఐదేళ్ల టైమ్ డిపాజిట్, పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు మారలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)