అధికారిక అభ్యర్థిని కాను !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో 'అధికారిక అభ్యర్థి' అనేది మీడియా సృష్టేనని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే చెప్పారు. తాను క్షేత్ర స్థాయి కార్యకర్తనని, డెలిగేట్స్ తనను ఎంపిక చేశారని, పోటీ చేయాలని తనను నాయకులు కోరారని చెప్పారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ అధిష్ఠానం, గాంధీలు సూచించిన అనధికారిక అధికారిక అభ్యర్థి మీరేనా? అని అడిగినపుడు ఖర్గే స్పందిస్తూ, ''నేను కేవలం క్షేత్ర స్థాయి కార్యకర్తను. డెలిగేట్స్ నన్ను ఎంపిక చేశారు, నాయకులు పోటీ చేయమని నన్ను కోరారు'' అని తెలిపారు. ''అందరు సీనియర్ నేతలు, పీసీసీ అధ్యక్షులు, నన్ను ప్రతిపాదించినవారు, ఇతర డెలిగేట్లు నాకు ఫోన్ చేశారు. గాంధీ కుటుంబం బరిలో లేకపోతే, ఈ ఎన్నికల్లో మీరు పోటీ చేయండి అని నన్ను అడిగారు. చాలా మంది సీనియర్ నేతలు, డెలిగేట్ల కోరిక మేరకు, నేను పోటీ చేస్తున్నాను'' అని ఖర్గే చెప్పారు. ఖర్గేకు 50 ఏళ్ళకు పైబడిన రాజకీయ అనుభవం ఉంది. ఆయన తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని వికేంద్రీకరిస్తానని శశి థరూర్ చెప్తున్న విషయాన్ని ప్రస్తావించినపుడు ఖర్గే మాట్లాడుతూ, ఆయనతో తనను పోల్చవద్దని చెప్పారు. తాను బ్లాక్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి వచ్చానని, ఆ సమయంలో శశి థరూర్ ఉన్నారా? అని అడిగారు. శశి థరూర్ ప్రకటించిన మేనిఫెస్టోతో ఆయన ముందుకు వెళ్ళవచ్చునని చెప్పారు. అయితే తన ఎజెండా మాత్రం ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమేనని చెప్పారు. అందరు సీనియర్ నేతలు, నిపుణులతో సంప్రదించిన తర్వాత ఈ డిక్లరేషన్‌ను రూపొందించినట్లు తెలిపారు. పార్టీని ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయడానికి, మార్పు తేవడానికి యువ నాయకత్వం అవసరం ఉందా? అని ప్రశ్నించినపుడు ఖర్గే మాట్లాడుతూ, తాను ''ఆర్గనైజేషనల్ మ్యాన్''నని చెప్పారు. పార్టీలో ఎవరు ఏమిటో తనకు తెలుసునని తెలిపారు. యువత సేవలను ఎక్కడ అవసరమైతే అక్కడ తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న శశి థరూర్ ఈ నెల 7న మేనిఫెస్టోను విడుదల చేశారు. పార్టీని పునరుజ్జీవింపజేయడం, మళ్లీ బలోపేతం చేయడం, కార్యకర్తలను సాధికారులను చేయడం, అధికారాన్ని వికేంద్రీకరించడం, ప్రజలతో మమేకమవడం వంటి 10 అంశాలను ప్రస్తావించారు. ఈ పది అంశాలను అమలు చేస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని ఎదుర్కొనడానికి రాజకీయంగా దీటుగా ఎదగవచ్చునని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)