లాభాల్లోకి సూచీలు !

Telugu Lo Computer
0


ఆర్‌బీఐ రేట్ల పెంపు అంచనాల కంటే కొంత ఎక్కువే ఉన్నప్పటికీ.. మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. దీంతో ఒకరోజు విరామం తర్వాత సూచీలు తిరిగి లాభాల్లోకి ఎగబాకినట్లైంది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు చివరి గంటన్నరలో కాస్త తడబడినప్పటికీ ఆఖరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఆర్‌బీఐ రేట్ల పెంపునకు మదుపర్లు ముందే సిద్ధమై ఉన్న నేపథ్యంలో సూచీలు పెద్దగా చలించలేదు. ఆర్‌బీఐ ప్రకటన వెలువడిన వెంటనే ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేసిన మార్కెట్లు గరిష్ఠాల వద్ద అమ్మకాలతో కిందకు దిగొచ్చాయి. రూపాయి బలపడడం, చమురు ధరలు 95 డాలర్ల దిగువకు రావడం కూడా సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు బలమైన కార్పొరేట్‌ ఫలితాలూ మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. నిఫ్టీ ఉదయం 17,423.65 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 17,474.40 వద్ద గరిష్ఠాన్ని, 17,348.75 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 15.50 పాయింట్ల స్వల్ప లాభంతో 17,397.50 వద్ద స్థిరపడింది. 58,421.04 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 58,649.19 - 58,244.86 మధ్య కదిలింది. చివరకు 89.13 పాయింట్లు ఎగబాకి 58,387.93 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.79.47 వద్ద ట్రేడయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)