సమాజాన్ని చదివిన న్యాయవాది రావి శాస్త్రి

Telugu Lo Computer
0


విశాఖ వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు అంకోసా హాలులో రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన రావిశాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి) శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణను రావిశాస్త్రి కుటుంబీకులు ఘనంగా సత్కరించారు. రావిశాస్త్రికి నివాళులు అర్పించిన అనంతరం శతజయంతి సభలో జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. రావిశాస్త్రి కవిత్వం ముందు తన హోదా కూడా గొప్ప కాదని తన అభిప్రాయమని పేర్కొన్నారు. రావిశాస్త్రి సూక్తులను విశాఖలో శాశ్వతంగా గుర్తుండేలా నిర్మించాలని సూచించారు. ఈనాటి సమాజం ఎక్కువగా గిరీషాలతో నిండి పోయిందని అప్పట్లోనే రావి శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారని, ఇప్పటికీ అది యథార్థంగానే ఉందన్నారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటే మాండలిక భాషను వాడుకలో ఉంచాలని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. లా కంటే సమాజాన్ని ఎక్కువగా చదివిన న్యాయవాది రావి శాస్త్రి అని.. తాను కూడా లా కళాశాల తరగతి గదులకంటే సామాజిక అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టే వాడిని అని తెలిపారు. ఆగస్టు 27 న పదవీరమణ చేయబోతున్న నేపథ్యంలో పనుల ఒత్తిడి ఉండటంఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని.. విరమణ తర్వాత విశాఖ వచ్చి ఎక్కువ సమయం గడుపుతానని ఎన్వీ రమణ వెల్లడించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రావిశాస్త్రి యారాడకొండపై రచన చేసి విశాఖపై తన మక్కువ చాటుకున్నారని తెలిపారు. రచయితగా ఆయన సృష్టించిన పాత్రలు చట్టాలు, శాసన వ్యవస్థల గురించి మాట్లాడాయని, వ్యవస్థలపై నమ్మకం పోతే ఏమవుతుందో తన రచనల్లో వివరించారని అన్నారు. సవ్యరీతిలో లేని, సరిగ్గా అమలుకాని చట్టాల గురించి తన రచనల్లో చెప్పారన్నారు. తీర్పుకు కేవలం సాక్ష్యాధారాలు మాత్రమే కాదు.. అందుకు దారి తీసిన పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని రావిశాస్త్రి చెప్పే వారని, ఇప్పుడదే చేస్తున్నామని ఎన్వీ రమణ పేర్కొన్నారు. నిజం హత్యకు గురైతే దేవుడే న్యాయం చేస్తాడని చెప్పే విధంగా రావిశాస్త్రి తన కథనాల్లో చెప్పే వారని, రాజ్యధిక్కరణ కేసు సెక్షన్ 124 తాత్కాలిక రద్దు వెనక రావిశాస్త్రి ప్రభావం కూడా ఉందన్నారు. అప్పట్లోనే కాలం చెల్లిన ఇలాంటి చట్టాలు అవసరమా అని రావిశాస్త్రి చెప్పే వారన్నారు. అటు తెలుగు భాషను పరిరక్షించేందుకు అందరూ భాగస్వామ్యులు కావాలని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. రావిశాస్త్రి తన రచనల్లో ప్రజల కష్టాలను, వారి జీవితాలను వివరించారని తెలిపారు. అప్పట్లో వారానికి ఒకసారి వచ్చే ‘రత్తాలు-రాంబాబు’ రచన కోసం ఎదురుచూసేవాళ్లమని ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు. శతాబ్దాల కిందట ఒక రావి చెట్టు గౌతముడిని ప్రభావితం చేసిందని, ఈ శతాబ్దంలో ఒక ‘రావి’ సమాజాన్ని ప్రభావితం చేసిందని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)