ఆర్టికల్ 370 రద్దుకు మూడేళ్లు !

Telugu Lo Computer
0


ఆర్టికల్ 370 రద్దు అనంతరం గడిచిన మూడేళ్లుగా ప్రశాంతంగా ఉందని ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మూడేళ్లలో భద్రతా దళాల కాల్పుల్లో ఏ ఒక్క పౌరుడు గాయపడలేదని, అలాగే ఎన్‭కౌంటర్ జరిగిన ప్రదేశాల్లో రాళ్లు రువ్వే సంఘటనలు కనపించలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల తమకు ఉగ్రవాదులను పట్టుకోవడం మరింత సులభంగా ఉంటుందని విజయ్ కుమార్ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి మూడేళ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం జమ్మూ కశ్మీర్‭లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్క పౌరుడూ గడిచిన మూడేళ్లలో మరణించలేదని ఏడీజీపీ చెప్తున్నప్పటికీ పోలీసు డేటాలోని సమాచారం మరో విధంగా కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం నాటి నుంచి 174 మంది పోలీసులు, 110 మంది పౌరులు వివిధ ఘటనల్లో మరణించారట!. ఆర్టికల్ 370 రద్దుకు ముందు 2016 ఆగస్టు 5 నుంచి 2019 ఆగస్టు 4 వరకు అదే మూడేళ్లలో 290 మంది పోలీసులు మరణించారని పోలీసు డేటా చెప్తోంది. ఆర్టికల్ 370 రద్దుకు పూర్వం మూడేళ్లలో 930 ఉగ్ర ఘటనలు నమోదు కాగా, రద్దు అనంతరం మూడేళ్లలో 617 ఉగ్ర ఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‭కు కల్పించిన ప్రత్యేక హోదా అయిన ఆర్టికల్ 370ని 2019లో ఇదే రోజున పార్లమెంట్ రద్దు చేసింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ ఆర్టికల్ రద్దు అనంతరం కశ్మీర్ రెండు భాగాలుగా విడిపోయింది. లధాఖ్ ప్రాంతం పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మారిపోగా మిగిలిన జమ్మూ కశ్మీర్‭ను అదే పేరుతో కొనసాగిస్తూ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. పరిస్థితులు సద్దుమణిగాక రాష్ట్ర హోదా ఇస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)