బీహార్‌లో కల్తీ మధ్యానికి 11 మంది బలి !

Telugu Lo Computer
0


బీహార్‌లోని శరణ్ జిల్లా పుల్వారియా పంచాయతీ పరిధిలో కల్తీ మద్యం సేవించి 11 మంది మృతి చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో చాలామంది తమ కంటిచూపును కోల్పోయారు.  శ్రావణ మాసం సందర్భంగా పుల్వారియా పంచాయతీ పరిధిలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఆగస్టు 3న నిర్వహించిన ఉత్సవాల సందర్బంగా సాంప్రదాయం ప్రకారం కొంతమంది మద్యం సేవించారు. అయితే అది కల్తీ మద్యం కావడంతో చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైనవారిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో 9 మంది పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అధికారుల రాకకు ముందే గ్రామంలో మరో కల్తీ మద్యం బాధితుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇప్పటివరకూ కల్తీ మద్యం కారణంగా మృతి చెందినవారి సంఖ్య 11కి చేరింది. ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తించిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. బీహార్‌లో 2016 నుంచి మద్య నిషేధం అమలవుతోంది. అయినప్పటికీ కల్తీ మద్యం చావులు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకూ 50కి పైగా కల్తీ మద్యం మరణాలు చోటు చేసుకున్నాయి. గత నెలలో గుజరాత్‌లోనూ కల్తీ మద్యం మరణాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)