నాగ చైతన్యనేనా?

Telugu Lo Computer
0


ఆమీర్‌ఖాన్‌  కీలక పాత్రలో అద్వైత్‌ చందన్‌ తెరకెక్కిస్తున్న కామెడీ డ్రామా 'లాల్‌ సింగ్‌ చడ్డా'లో యువ నటుడు నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ మూవీ కావడంతో ఆయన నటిస్తున్న పాత్రపై ఎన్నో అంచనాలు వున్నాయి. వాటికి తగ్గట్టే చైతూ పాత్ర ఉంటుందని తాజాగా విడుదల చేసిన వీడియో చూస్తే అర్థమవుతోంది. నాగచైతన్య ఇందులో బాలరాజు అనే పాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను 'లాల్‌ సింగ్‌ చడ్డా' టీమ్‌ పంచుకుంది. బాలరాజు పాత్ర కోసం చైతు పడిన కష్టాలను ఇందులో చూపించారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. ''ఈ స్క్రిప్ట్‌ నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత్ర పేరు బాల. ఆంధ్రప్రదేశ్ లోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన ఒక యువకుడు. చాలా మంది పేర్లకు ముందు ఇంటి పేరుగా ఊరి పేర్లు కూడా జత చేసి ఉంటాయి. అందుకే బాలరాజుకు బోడిపాలెం ఇంటి పేరుగా పెట్టాం. అంతేకాదు, బాలకృష్ణ, బలరాం సహా నాలుగైదు పేర్లు పరిశీలించాం. చివరకు ఆమిర్‌ సర్‌ సహా చిత్ర బృందానికి బాలరాజు నచ్చింది. మా తాతయ్య 'బాలరాజు' అనే చిత్రంలో నటించడం ఓ మ్యాజిక్‌. షూటింగ్‌ అయిపోయిందని చెప్పినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. షూటింగ్‌ జరిగినన్ని రోజులూ నన్ను నేను మర్చిపోయా. కొత్త ప్రపంచాన్ని చూశా. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం. ముఖ్యంగా కార్గిల్‌, శ్రీనగర్‌ షెడ్యూల్స్‌ నాకెంతో ప్రత్యేకం. ఆఫ్‌ స్క్రీన్‌.. ఆన్‌ స్క్రీన్‌ ప్రతి సంఘటన ఒక మ్యాజికల్‌'' అని చైతూ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతూ చెప్పుకొచ్చారు. చైతన్య పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావు హెయిర్‌స్టైల్స్‌, మీసకట్టును రిఫరెన్స్‌గా తీసుకున్నారు. పళ్లు కాస్త ఎత్తుగా కనిపించేందుకు క్లిప్‌ పెట్టారు. నాగచైతన్యతో కలిసి ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని, ఎప్పుడూ యూనిట్‌తో కలిసి పనిచేస్తారని, ఏ షాట్‌లోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటారని ఆమిర్‌ఖాన్‌ అన్నారు. హిందీ వచ్చిన నటులు కూడా కొన్ని సార్లు ఇబ్బందిపడతారు కానీ, చైతన్య అస్సలు ఇబ్బంది పడలేదని దర్శకుడు అద్వైత్‌ చందన్‌ చెప్పుకొచ్చారు. 'లాల్‌సింగ్‌ చడ్డా'లో కరీనాకపూర్‌ కథానాయిక. తెలుగు వెర్షన్‌కు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ 'ఫారెస్ట్‌ గంప్‌' రీమేక్‌గా 'లాల్‌సింగ్‌ చడ్డా'ను రూపొందించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)