నీటిలో మునిగిన యానాం

Telugu Lo Computer
0


ధవళేశ్వరం బ్యారేజీ నుండి 25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడంతో గౌతమి గోదావరి నది ఉగ్రరూపంలో ప్రవహిస్తోంది. గోదావరి నది పరివాహక ప్రాంతమైన కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాం మునుపెన్నడూ లేని విధంగా ముంపు బారిన పడింది. భారీ వరదల కారణంగా గోదావరికి చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది. గోదావరి పాయ అయిన గౌతమీ నది ఉద్ధృతితో యానాంలో కాలనీలు నీట మునిగాయి. పలు కాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. అడుగు బయట పెట్టలేని పరిస్థితి..పెడితే మెడవరకు వస్తున్నవరదప్రవాహం. ఎటు చూసినా వరద నీరే…చెరువులను తలపిస్తున్న రోడ్లు. అంతా రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. ప్రశాంతంగా నిద్రపోయిన ప్రజలపై వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. అర్ధరాత్రి నీరు రావడంతో ఉలిక్కి పడిన ప్రజలు… సూర్యోదయం వరకు బిక్కుబిక్కుమంటు…గోడలు, డాబాలపై కంటిమీద కునుకు లేకుండా కూర్చున్నారు. ఆకలితో ఆపన్న హస్తం ఎదురు చూసిన వారికి మాజీ ఎమ్మెల్యే మల్లాది కృష్ణారావుతో పాటు పలు స్వచ్చంద సంస్థలు సహాయం చేస్తున్నా…కొందరికే అందుతున్నాయి. మరోవైపు రంగంలోకి దిగిన NDRF సిబ్బంది వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)