అసమ్మతి గూటికి మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో చోటుచేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు అసోంలోని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండేతో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో గోటానగర్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉన్న విషయం తెలిసిందే. శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇప్పటికే కుప్పకూలే పరిస్థితికి వచ్చింది. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఏక్‌నాథ్ షిండే వద్దకు వెళ్లిపోవడంతో ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తన సొంత నివాసం మాతృశ్రీ లో జరిగే సమావేశానికి పార్టీనేతలు అందరూ హాజరు కావాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, అసెంబ్లీ రద్దు అంశాలపై నేతలతో చర్చించే అవకాశం ఉంది. నిన్న రాత్రి ముఖ్యమంత్రి అధికారిక నివాసం వర్ష భవన్‌ను ఉద్ధవ్ ఠాక్రే ఖాళీ చేశారు. శివసేన పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు దృష్ట్యా ప్రభుత్వ మనుగడపై చర్చించడానికి ఎన్సీపీ నేతలతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై శరద్ పవార్ చర్చించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)