మహింద్రా గ్రూప్ లో అగ్నివీరులకు ఉద్యోగమిస్తాం !

Telugu Lo Computer
0


అగ్నిపథ్ పథకంను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఆర్మీలో నాలుగేళ్ల సర్వీస్ ఆనంతరం అగ్నివీరులను తాము నియమించుకుంటామని ఆయన తెలిపారు. 'అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారిని ప్రముఖంగా ఉపాధి పొందేలా చేస్తాయి.. మహీంద్రా గ్రూప్ అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకుంటుంది' అంటూ ఆనంద్ మహింద్రా ట్వీటర్ ద్వారా తెలిపారు. కాగా అగ్నిపథ్ స్కీమ్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తనకు బాధ కలిగించిందన్నారు. కార్పొరేట్ రంగంలో అగ్నివీరుల ఉపాధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. నాయకత్వం, శారీరక శిక్షణతో, అగ్నివీర్ కార్యకలాపాల నుంచి పరిపాలన వ్యవహారాల వరకు పూర్తిస్థాయిలో సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహించగలుగుతారని అన్నారు. ఇదిలాఉంటే అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్లు పనిచేసిన తరువాత యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ముద్ర లోన్, స్టాండ్ ఆఫ్ ఇండియా వంటి పథకాలు అగ్నివీర్లకు సహాయపడతాయని కేంద్ర పేర్కొంది. నాలుగేళ్ల కాలంలో ఆకర్షణీయమైన ప్యాకేజీతో పాటు, సర్టిఫికెట్లు, డిప్లొమాలు ఇవ్వడం ద్వారా ఉన్నత విద్యకు అప్పు కూడా పొందవచ్చునని కేంద్రం తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)