రైల్వే చట్టం బలోపేతానికి చర్యలు !

Telugu Lo Computer
0


రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ టీవీ ఛానెల్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని 'అగ్నిపథ్‌' నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం.. యువత సమస్యలన్నింటినీ వింటుందని, వాటిని పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో యువకులు ఆగ్రహంతో రైల్వే స్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పంటించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ 'రైల్వేలు.. మన సొంత ఆస్తి అని అర్థం చేసుకోవాలి. పేద, మధ్యతరగతి వర్గాలకు, విమాన సేవలు అందుబాటులో లేని ప్రాంతాలకూ రైల్వేశాఖ సేవలు అందిస్తుంది' అని వివరించారు. ఈ క్రమంలోనే.. రైల్వే చట్టాన్ని మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైల్వే ఆస్తులను కాపాడుకునేందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్టు పురోగతిపై స్పందిస్తూ.. గుజరాత్‌లోని వాపి, అహ్మదాబాద్ మధ్య 60 కి.మీ మేర ఇప్పటికే హైస్పీడ్ పిల్లర్ల నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించారు. 170 కి.మీ మేర పునాది పనులు పూర్తయ్యాయని, ఏడు నదులపై వంతెనల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు నడపనున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)