వారికి లేని పెన్షన్ నాకెందుకు..?

Telugu Lo Computer
0


సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకంపై విమర్శలు కొనసాగుతున్నాయి. సొంత ప్రభుత్వాన్ని భాజపా ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి తనదైన శైలిలో ప్రశ్నించారు. ఈ పథకంలో అగ్నివీరుల పెన్షన్‌కు సంబంధించి ఎలాంటి నిబంధన లేకపోవడమేంటన్నారు. 'అగ్నివీరులు స్వల్పకాలం దేశానికి సేవ చేస్తారు. వారికి పెన్షన్ పొందే హక్కు లేదు. ప్రజా ప్రతినిధులకు మాత్రం ఈ సదుపాయం ఎందుకు కల్పిస్తున్నారు..? దేశాన్ని రక్షించే వారు పెన్షన్ పొందడానికి అర్హులు కాకపోతే, నేను కూడా దానిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు ఏమంటారు?' అంటూ వరుణ్ గాంధీ ట్విటర్ వేదికగా అగ్నివీర్ నిబంధనలను వ్యతిరేకించారు. యువత సాయుధ బలగాల్లో స్వల్పకాలం సేవలందించే నిమిత్తం కేంద్రం ఇటీవల అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకువచ్చింది. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్కులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే ఈ ఏడాదికి ఆ పరిమితిని 23కు పెంచింది. ఎంపికైన వారు అగ్నివీరులుగా నాలుగేళ్లపాటు సేవలు అందిస్తారు. తర్వాత 25 శాతం మంది శాశ్వత కేడర్‌కు ఎంపికవుతారని చెప్పింది. మిగిలిన 75 శాతం మంది పెన్షన్ లేకుండా రిలీవ్‌ కానున్నారు. అయితే రిలీవ్‌ సమయంలో కేంద్రం వారికి కొంత మొత్తం ఇవ్వనుంది. రెండేళ్లుగా సైనిక ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులను ఈ ప్రకటన మెప్పించలేదు. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో అగ్నివీరులుగా పనిచేసి బయటకు వచ్చిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామని కొందరు వ్యాపారవేత్తలు భరోసా ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)