కురుక్షేత్ర జైలులో పెట్రోల్ బంకు ఏర్పాటు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జైళ్ల ఆవరణలో ఖైదీలే స్వయంగా పెట్రోలు బంకులు నిర్వహిస్తున్నారు. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇలాంటి పెట్రోలు బంకుల్లో మోసాలు ఉండే అవకాశం లేదని భావిస్తున్న వాహనదారులు ఇంధాన్ని ఆయా బంకుల్లో నింపుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు హర్యానా ప్రభుత్వం కూడా తెలంగాణ బాటలోనే నడుస్తోంది. కురుక్షేత్ర జైలు ఆవరణలో ఓ పెట్రోలు బంకును ఏర్పాటు చేసి దాని నిర్వహణ బాధ్యతలను ఖైదీలకు అప్పగించింది. ఈ బంకు నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, లోపాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని మరో 10 జైళ్లలోనూ పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో కురుక్షేత్రలో పైలట్ ప్రాజెక్టుగా పెట్రోలు బంకును ఏర్పాటు చేసిన హర్యానా ప్రభుత్వం మే 31 నుంచే దానిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అంబాలా జైలులో రెండు, యమునానగర్, కర్నాల్, ఝాజ్జార్, ఫరీదాబాద్, గురుగామ్, భివానీ, హిసార్‌లలో ఒక్కోటి చొప్పున పెట్రోలు బంకులు ఏర్పాటు చేయబోతోంది. ఈ జైలు పెట్రోలు బంకుల్లో పనిచేసేందుకు దోషులుగా తేలిన ఖైదీలను, వారి ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని అనుమతిస్తారు. అండర్ ట్రయల్ ఖైదీలను అనుమతించరు. వారి ప్రవర్తన ఆధారంగా రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు ఉంటాయని రాష్ట్ర జైళ్ల మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా తెలిపారు. సమాజంలో ఖైదీలను భాగం చేయడమే లక్ష్యంగా రొటేషన్ పద్ధతిని అవలంబిస్తున్నట్టు చెప్పారు. ఈ బంకులకు వచ్చిన వినియోగదారులు ఖైదీలు కూడా సాధారణ ప్రజల్లానే పనిచేస్తుండడాన్ని చూస్తారని, ఖైదీలు కూడా సంస్కరించవచ్చని, పునరావాసం కల్పించవచ్చన్న సందేశం ప్రజల్లోకి వెళ్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ బంకుల్లో పనిచేసే ఖైదీలకు జైలు నిబంధనల ప్రకారం వేతనం కూడా లభిస్తుంది. బంకుల నిర్వహణ ద్వారా వచ్చిన లాభాలను ప్రిజన్ వెల్ఫేర్ ఇండస్ట్రియల్ ఫండ్‌కు వెళ్తుంది. ఈ మొత్తాన్ని ఖైదీల సంక్షేమానికి వినియోగిస్తారు. పిల్పి-కురుక్షేత్ర రోడ్డులో అంబాలా-ఢిల్లీ జాతీయ రహదారికి అర కిలోమీటరు దూరంలో ఉన్న కురుక్షేత్ర జైలు పెట్రోలు బంకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది. రోజుకు దాదాపు రూ. 4 లక్షల ఇంధనాన్ని విక్రయిస్తున్నారు. అయితే, ఇప్పుడీ వేళలను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మార్చాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడు రోజుకు రూ. 8 లక్షల వరకు వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం జైలు సిబ్బంది బంకును నిర్వహిస్తారు. ఎందుకంటే జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం ఏడున్నర గంటల తర్వాత ఖైదీలు బయట ఉండడానికి వీల్లేదు. ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో కురుక్షేత్రలోని ఫ్యూయల్ స్టేషనే మొట్ట మొదటిదని, ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని జైలు అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)