కలుషిత గాలితో నాడీ సంబంధిత వ్యాధులు !

Telugu Lo Computer
0


బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంతో పాటు చైనాలోని పలు పరిశోధనా సంస్థలు అధ్యయనం చేసి గాలి కాలుష్యం వల్ల నాడీ సంబంధిత వ్యాధులూ వచ్చే ప్రమాదం ఉందని తెలిపాయి. వీటిని అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. కలుషిత గాలి ఉన్న ప్రాంతాల్లో శ్వాస పీల్చుకుంటే విష కణాలు ఊపిరితిత్తుల నుంచి మెదడుకు వెళ్తాయని అందులో పేర్కొన్నారు. రక్త ప్రసార మార్గాల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. దీంతో మెదడు సహా నాడీ సంబంధిత వ్యాధులు వస్తాయని చెప్పారు. రక్తప్రసార మార్గాల ద్వారా ఊపిరితిత్తుల నుంచి వెళ్లే ఆ విష కణాలు శరీరంలోని ఇతర కీలక అవయవాలకంటే మెదడులోనే చాలా కాలం పాటు ఉండగలవని వివరించారు. మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతోన్న కొందరు రోగుల మెదడు, వెన్నెముకకు సంబంధించిన ద్రవంలో విష కణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారని తెలిపారు. కేంద్ర నాడీ వ్యవస్థపై ఆ విష కణాలు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని గుర్తించినట్లు వివరించారు. శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే విష కణాలు శరీరంలోని ఇతర అవయవాలకు ఎలా వెళ్తున్నాయన్న విషయం కూడా ఈ పరిశోధన ద్వారా వెలుగులోకి వచ్చిందని అన్నారు. ముక్కు ద్వారా నేరుగా మెదడులు వెళ్లే విష కణాల కన్నా ఊపిరితిత్తుల ద్వారా ఎనిమిది రెట్లు అధికంగా విష కణాలు వెళ్తాయని తేలినట్లు పరిశోధకులు చెప్పారు. గాలి కాలుష్యం, మెదడులో విష కణాల వల్ల సంభవించే దుష్పరిణామాల మధ్య ఉండే సంబంధం గురించి పరిశోధన ద్వారా కొత్తగా రుజువు అయినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)