గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి సుప్రీం క్లీన్‌చిట్

Telugu Lo Computer
0

2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి సిట్ క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ భార్య జకియా జఫ్రీ సిట్‌ దర్యాప్తును సవాల్‌ చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ తోసిపుచ్చింది. సిట్‌ నివేదికను సమర్థిస్తూ గతంలో ప్రత్యేక మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ జారీ చేసిన ఆదేశాలతో తాజాగా జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్‌, దినేశ్ మహేశ్వరి, సిటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. సిట్ ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. 2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్‌ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ సహా 68 మంది మరణించారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసుతో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సహా మరికొంతమందికి ఎలాంటి సంబంధం లేదని సిట్‌ తేల్చింది. సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ జకియా పలుకోర్టులను ఆశ్రయించారు. మార్చి 2008న సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీని సిట్‌ దాదాపు తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోదీని సిట్‌ తప్పించింది. ప్రధాని మోదీకి ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు సిట్‌ ఉత్తర్వులను సమర్థించడంతో జఫ్రీ, సెతల్వాద్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌ హైకోర్టులోనూ చుక్కెదురవడంతో సిట్‌ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించగా.. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం కూడా వారి పిటిషన్‌ను కొట్టివేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)