72 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

Telugu Lo Computer
0


 రాష్ట్రపతి ఎన్నిక కోసం మొత్తం 72 మంది అభ్యర్థులు ప్రస్తుతం నామినేషన్ వేశారు. నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసినప్పటికీ, వాటిని ఉపసంహరించుకునేందుకు జూలై 2వరకు గడువు ఉంది. ఆలోపు ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాతే ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేస్తున్నారు అనే దానిపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం 72 మంది అభ్యర్థులకు చెందిన 85 అప్లికేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ అధికారుల సమాచారం ప్రకారం ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల కోసం 115 నామినేషన్లు వచ్చాయి. అయితే, వాటిలో 28 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. సరైన పత్రాలు, నిర్ధిష్ట ఫార్మాట్‌లో లేని కారణంగా వాటిని అధికారులు తిరస్కరించారు. ఇంకా 72 మంది బరిలో నిలిచారు. ఎంత మంది పోటీ చేసినప్పటికీ ప్రధానంగా ఇద్దరి మధ్యే పోటీ ఉంటుంది. వారిలో ఒకరు అధికార ఎన్డీయే తరఫు అభ్యర్థి ద్రౌపది ముర్ము కాగా, మరొకరు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. ఈ ఇద్దరి మధ్యే ప్రధానంగా పోటీ జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులను కనీసం 50 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. అలాగే మరో 50 మంది సెకండరీ ప్రతిపాదన చేయాలి. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు వరకు నామినేషన్లు వేయవచ్చు. డిపాజిట్ కింద రూ.15,000 చెల్లించాలి. ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు చెరి నాలుగు నామినేషన్లు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నిక వచ్చే నెల 18న జరుగుతుంది. 21న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24న ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతి 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)