ఆంక్షల దిశగా 15 ముస్లిం దేశాలు ?

Telugu Lo Computer
0


మహమ్మద్ ప్రవక్త గురించి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రమాదంలో పడేశాయి. ఒకటి కాదు రెండు కాదు 15 ముస్లిం దేశాలు భారత్‌పై ఆంక్షల దిశగా అడుగులేస్తున్నాయి. వాటిలో భారత ఆర్ధిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే దేశాలు కూడా ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది.  స్వేచ్ఛ ఇచ్చారు కదా అని.. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో.. ప్రస్తుత భారత పరిస్థితిని చూస్తే అర్ధం అవుతుంది. ఇద్దరు అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు భారత ఆర్ధిక వ్యవస్థను ప్రమాదంలో పడేశాయి. మహమ్మద్ ప్రవక్తను కించపరుస్తూ చేసిన మాటలు.. భారత్, గల్ఫ్ దేశాల మధ్య చిచ్చు రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15దేశాలు భారత్‌పై మండిపడుతున్నాయి. భారత రాయబారులను పిలిపించి నోటీసులు ఇవ్వడంతో పాటు.. భారత వస్తువులపై ఆయా దేశాలు బ్యాన్ విధిస్తున్నాయి. భారత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. పాకిస్థాన్‌తో గొడవ విషయంలోనూ… భారత్‌కే సపోర్ట్ చేసిన గల్ఫ్‌ కంట్రీస్.. ఇప్పుడు మనంపై ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటే.. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయా దేశాలు ఎంత సీరియస్‌గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఓ టీవీ చర్చలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బీజేపీ విభాగానికి చెందిన నవీన్‌కుమార్ జిందాల్ కూడా ఓ ట్వీట్ చేశారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలు ముస్లిం సమాజానికి కోపం తెప్పించాయి. పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వివాదానికి కారణమైన నేతలు ఇద్దరూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. వారిని పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. ఏ మతాన్నీ, వర్గాన్ని కించపరిచే భావజాలానికి తాము వ్యతిరేకమని బీజేపీ ప్రకటించింది. అలాంటి వ్యక్తులను ప్రోత్సహించబోమని ప్రకటన చేసింది. అయినా మాటల మంటలు చల్లారలేదు. నిరసనలు భారత్ నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరాయి. కువైట్, ఖతర్, ఇరాన్ దేశాలు భారత రాయబారులను పిలిపిలించి నిరసన తెలిపాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను సౌదీ అరేబియా కూడా ఖండించింది. మరోవైపు మహమ్మద్ ప్రవక్తపై నుపుర్‌, జిందాల్ వ్యాఖ్యలపై ముస్లిం దేశాల నుంచి వ్యతిరేకత ఆగడంలేదు.. ఇప్పటివరకు ఈ వ్యాఖ్యలపై ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్, యుఎఇ, ఇరాన్, జోర్డాన్, ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, మాల్దీవులు, లిబియా మరియు ఇండోనేషియాతో సహా 15 దేశాలు భారత్‌పై అధికారికంగా నిరసనలు తెలిపాయి. వివాదాస్పద వ్యాఖ్యలపై అరబ్‌ ప్రపంచం భగ్గుమంటోంది. అరబ్ దేశాలు తమ ప్రజల్లో ఉన్న కోపాన్ని చల్లార్చడానికి.. భారత్‌ విషయంలో గట్టి చర్య తీసుకోవాలని చూస్తున్నాయి. ఆయా దేశాల్లో భారత్‌ను విమర్శించే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వారి మీడియా సంస్థల్లో కూడా ఈ అంశానికి సంబంధించిన వార్తలే టాప్‌లో ఉంటున్నాయి. భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు పిలుపునిచ్చాయి. ఖతర్, కువైట్‌లోని కొన్ని దుకాణాలు భారతీయ ఉత్పత్తులపై నిషేధం విధించాయి. భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని కువైట్‌, ఖతర్‌ ప్రజలు సోషల్‌మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యల చేసిన వారికి ఎలాంటి శిక్ష విధించకపోవడం మానవ హక్కుల పరిరక్షణకు తీవ్ర ప్రమాదమని ఖతర్ హెచ్చరించింది. ఇది హింస, ద్వేషం వంటి వాటిని ప్రోత్సహించే మత దురభిమానానికి దారి తీయవచ్చని ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ఆ ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు భారత్‌ను ఎంతలా దిగజార్చాయంటే.. అరాచకాలకు కేరాఫ్‌గా ఉండే తాలిబన్లు కూడా భారత్‌కు సూక్తులు చెబుతున్నారు. అది కూడా మత సామరస్యం విషయంలో మనం ఎలా ఉండాలో తాలిబన్లు చెబుతున్నారు…! ఇస్లాంను అవమానించడం, ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టే దిశగా మతోన్మాదులు వ్యాఖ్యానించకుండా భారత్ సర్కారు చర్యలు తీసుకోవాలని తాలిబన్ అధికార ప్రతినిధి జబీదుల్లా ముజాహిద్ డిమాండ్‌ చేశారు. అయితే తన సొంత దేశంలో ముస్లింలను వర్గాల కింద విభజించి వివక్ష చూపించే తాలిబన్లు కూడా భారత్‌కు సలహాలు ఇవ్వడం విడ్డూరందా ఉంది. బుద్ధుడి విగ్రహాలను, బౌద్ద ఆలయాలను కూల్చేసిన చరిత్ర కలిగిన అఫ్ఘానిస్తాన్‌.. మతం విషయంలో భారత్‌ను విమర్శిస్తోంది. నిన్నమొన్నటివరకు భారత్‌పై ఎనలేని ప్రేమ కురిపించిన దేశాలు.. ఇప్పుడు ఇండియా వ్యతిరేక స్టేట్‌మెంట్లు ఇస్తుండడం.. కేంద్రానికి తలనొప్పిగా మారింది. గల్ఫ్‌లోని భాగస్వామ్య దేశాలతో పెరుగుతున్న భారత సంబంధాలకు ఈ వ్యాఖ్యలు ఇబ్బంది తెచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు కూడా బీజేపీ టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. గల్ఫ్‌లో 90 లక్షల మంది భారతీయులు పని చేస్తున్న సంగతి మర్చి పోతే ఎలా అని.. ఇండియాకు అత్యధిక విదేశీ మారక ద్రవ్యం చేకూర్చే తొలి 7 దేశాల్లో 5 గల్ఫ్‌ దేశాలేనని మర్చిపోవద్దంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. నిజానికి ప్రతిపక్షాల విమర్శలకు అర్థముంది. ఎందుకంటే భారత్‌కు మిగిలిన అన్ని దేశాలతో ఉన్న బంధం ఒకటైతే.. గల్ఫ్‌ దేశాలతో ఉన్న అనుబంధం చారిత్రకంగా, వాణిజ్యపరంగా ఎంతో ముఖ్యమైనది. 2020-21లో గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్‌తో భారత వాణిజ్యం 6 లక్షల 75 వేల కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే గల్ఫ్ దేశాల్లో 87లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. గల్ఫ్ దేశాలు కన్నెర్ర చేస్తే భారత ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే అరబ్‌ దేశాలను శాంతి పరిచేందుకు సీనియర్‌ దౌత్యవేత్తలను కేంద్రం రంగంలోకి దించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)