శేరిలింగంపల్లి భాజపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు

Telugu Lo Computer
0


హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గ భాజపాలో కొనసాగుతున్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అదే పార్టీకి చెందిన గచ్చిబౌలి కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డి సమక్షంలో ఆయన అనుచరులు భాజపా నియోజకవర్గ ప్రధాన నాయకుడు మొవ్వా సత్యనారాయణపై దాడి చేశారు. శేరిలింగంపల్లి భాజపా ఆధ్వర్యంలో 'మీ సమస్య- మా పోరాటం' అనే కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం మొవ్వా సత్యనారాయణతో పాటు భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గజ్జల యోగానంద్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్‌, ప్రభాకర్‌ యాదవ్‌, నరేష్‌తో పాటు పలువురు నేతలు గోపన్‌పల్లి ప్రాంతంలోని చెరువుల పరిశీలనకు వెళ్లారు. కొందరు యువకులు అక్కడికి చేరుకొని వాదనకు దిగికొట్టారు. అదే సమయంలో గంగాధర్‌రెడ్డి రావడంతో మరికొందరు యువకులు వచ్చారు. అనంతరం వారు రాళ్లు కర్రలతో దాడి చేశారు. మొవ్వా సత్యనారాయణను తీవ్రంగా కొట్టడంతో నోటి నుంచి రక్తస్రావమైంది. స్పృహ తప్పిపడి పోవడంతో కార్యకర్తలు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులపై 324 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. మరోవైపు భాజపా నాయకులు తమని కులం పేరిట దూషించారని కార్పొరేటర్‌ అనుచరుడు నర్సింగ్‌ ఫిర్యాదు చేయగా, సంబధిత నేతలపై అట్రాసిటీ కేసు పెట్టినట్లు పేర్కొన్నారు. 'కేవలం నన్నే లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. కార్పొరేటర్‌ గంగాధర్‌ రెడ్డి అక్కడే ఉండి దాడి చేయించాడని' మొవ్వా సత్యనారాయణ ఆరోపించారు. ఈ దాడిని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, రంగారెడ్డి జిల్లా అర్బన్‌ అధ్యక్షుడు సామా రంగారెడ్డి తదితరులు తీవ్రంగా ఖండించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఫోన్‌ చేసి పరామర్శించారు. సమన్వయ లోపమే గోపన్‌పల్లి దేవుని చెరువు వద్ద స్వల్ప ఘర్షణకు దారితీసిందని కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానికుడైన తనకు సమాచారం ఇవ్వకుండా తమ పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని తన కార్యాలయం వద్ద ఫొటోలు, వీడియో చిత్రీకరిస్తుండగా నేతలు, తన కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)