బిజెపి నుంచి రాజ్యసభకు జూపల్లి రామేశ్వరరావు?

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ కోటాలో మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారనే వార్తలు ఇటు తెలంగాణలో, అటు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవలే నలుగురు సభ్యులు రాజ్యసభకు ఎంపికయ్యారు. తాను అవసరమైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటానని, తనను రాజ్యసభకు పంపించాలని జూపల్లి కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనేక రకాల సమీకరణాల దృష్యా జూపల్లి ఎంపిక జరగలేదు. సమతామూర్తి కార్యక్రమం సందర్భంగా శిలాఫలకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేకపోవడంతో చిన జీయరుస్వామికి, ఆయన శిష్యుడు జూపల్లికి కేసీఆర్‌తో దూరం పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయత్నించారు. కేసీఆర్‌తో జగన్‌కు మంచి సంబంధాలుండటంతో మళ్లీ రామేశ్వరరావుకు అవకాశం కల్పించి కేసీఆర్‌తో కయ్యం తెచ్చుకోవడం ఎందుకున్న ఉద్దేశంతో తమ ముఖ్యమంత్రి ఆయన్ని ఎంపిక చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దక్షిణాది బలపడాలనుకుంటున్న భారతీయ జనతాపార్టీ తెలంగాణ నుంచి తమ పార్టీ నేత ఒకర్ని ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయాలని ఆలోచిస్తున్న బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో తమ ఆర్థికంగా సహాయం చేసే వ్యక్తయితే బాగుంటుందనే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని, ఆ కోణంలో ఆలోచిస్తే జూపల్లికి అవకాశం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. వీరితోపాటు ఇంద్రసేనారెడ్డి, గరికపాటి నరసింహారావు, లక్ష్మణ్ లాంటివారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. గరికపాటి నరసింహారావును రాజ్యసభకు పంపుతామని గతంలోనే బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సి ఉంటుంది. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ఆ ఎన్నికల్లో తమకు అన్నిరకాలుగా సహాయ సహకారాలందించే వ్యక్తినే రాజ్యసభకు పంపించాలంటే ఆ పార్టీకి జూపల్లి రామేశ్వరరావు ఒక్కరే మంచి ఆప్షన్‌గా ఉన్నారని సీనియర్ రాజకీయవేత్తలు కూడా భావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)