బహుముఖ ప్రజ్ఞాశీలి డాక్టర్ తేజస్విని మనోజ్ఞ

Telugu Lo Computer
0


డాక్టర్ తేజస్విని మనోజ్ఞ అందగత్తెలతో పోటీపడి ఇండియాకి పతకం తెచ్చి పెట్టింది.. అంతేనా అంటే కాదు.  దేశ ఆర్మీదళంలో చేరి 13 లక్షల మందిలో బెస్ట్ క్యాడెట్ గా ప్రధానమంత్రి నుండి పతకం అందుకుంది. భరతనాట్యంలో తను చూపించిన ప్రతిభకి కలాం గారినే ఆదర్శంగా తీసుకుంటూ పెరిగిన తేజస్విని. ఆయన నుండే అభినందనలు అందుకుంది. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి భారతీయ కళల ఔన్నత్యం చాటుతోంది. అమ్మ దగ్గరే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న తేజస్విని చక్కగా కీర్తనలు ఆలపిస్తుంది. అంతేనా అంటే కాదు కాదు. తేజస్విని అంతర్జాతీయ యోగా టీచర్. పోలీసులకి కూడా తను యోగా పాఠాలు నేర్పుతుంది..తను పర్యావరణ ప్రేమికురాలు. పచ్చదనం కోసం.. భూమిని రక్షించమంటూ ప్రచారం చేస్తూ ఎంతోమందిని ప్రభావితం చేస్తోంది... అంతేనే అంటే అక్కడితో ఆగిపోలేదు... తను డాక్టర్ గా చదువుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ప్రజలకి సేవ చేయడానికి ఊరూ వాడా స్టెతస్కోప్ పట్టుకొని తిరిగేస్తుంది. అంతేనా అంటే కాదు కాదు... కలాం గారిలా యువతలో స్ఫూర్తి నింపాలి అంటూ కళాశాలలకి వెళ్ళి అక్కడి విద్యార్థులకు ప్రేరణ అందిస్తుంది. కలలు కనండీ.. వాటిని సాకరం చేసుకునేందుకు కష్టపడండీ అన్న మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పిన వ్యాఖ్యలు అమెలో ఎంత ప్రభావం చూపాయో తెలియదు కానీ స్వయంగా అయన చేతుల మీదుగా అవార్డును అందుకుని, అయన నోటి నుంచి అమె గురించి నాలుగు మాటలు చెప్పగానే ఆ సభావేదికలోనే అమె మనస్సు.. అవధులు లేనంత సంతోషంలో ఓలలాడింది. అమె తన వృత్తిలో రాణిస్తూనే.. ప్రవృత్తిలో కూడా అందలాన్ని అందుకోవాలని కలాం చేసిన ప్రసంగానికి అమె ముగ్దురాలైంది. ఓ దేశ మాజీ రాష్ట్రపతి తనపై ఇంతటి అభిమానం చూపడానికి కారణం.. అమె నృత్యమే. ఆమె నాట్యప్రదర్శనను వీక్షించిన కలాం.. అమెను కొనియాడకుండా వుండలేకపోయారు. ఈ క్రమంలో ఆమె అటు వైద్యురాలిగా కూడా సేవలందిస్తుందని తెలిసి.. అమె అటు తన వృత్తిలోనూ రాణించాలని అకాంక్షించారు. దీంతో అప్పటి వరకు ఆమె వృత్తి వైద్యం అయితే ప్రవృతి నాట్యం అని అనుకున్నవారందరూ ఆమె గురించి పూర్తిగా తెలుసుకుని తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. అమె మరెవరో కాదు ఉస్మానియా మెడికల్ కాలేజి నుంచి వైద్య పట్టాను అందుకున్న తెలుగు తేజం డాక్టర్‌ తేజస్విని మనోజ్ఞ. చదువూ, భరతనాట్యం.. యోగా.. సేవ.. అందాలపోటీలు..ప్రధానమంత్రి పతకం.. షూటర్, సింగర్, ఇలా ఎన్నో కళలలో ప్రావిణ్యాన్ని సంపాదించి.. తనకంటూ సముచిత స్థానాన్ని అందుకుంది.  చదువుకుంటున్నప్పుడే అమెకు అందాల పోటీలతో పాటు ఆరోగ్య సూత్రాలను పాటించడంపై ఆసక్తి కలిగింది. దీంతో అటు చిన్నతనం నుంచి అందాలపోటీలలో పాల్గొని బహుమతులను సాధించింది. దీంతో అమెకు అందాల పోటీలలో పాల్గోని విజయాన్ని అందుకుంటే ప్రజలకు సేవ చేసే అవకాశం అధికంగా లభిస్తుందని భావించింది. ఇక మరోవైపు పాఠశాల విద్యాబోధన సమయంలోనే అటు ఎన్.సీ.సీ లో కూడా రాణించింది. ఇంటర్ చదువుతూ ఎన్సీసీలో ఏబిసీ విభాగాలు పూర్తి చేశానని తెలిపింది. ఢిల్లీలో శిక్షణ తీసుకుంటూ 13 లక్షల మంది ఎన్‌సీసీ విద్యార్థుల్లో అనేక స్థాయుల్లో డ్రిల్‌, కవాతు, బృంద చర్చ, రైఫిల్‌ షూటింగ్‌, త్రివిధ దళాల అధికారులతో ఇంటర్యూలు చేశానని తెలిపింది. అన్ని విభాగాల్లో పాల్గొని 2010లో ఎన్సీసీలో ‘ఆల్‌ ఇండియా బెస్ట్‌ క్యాడెట్‌’గా నిలివడంతో తనకు ప్రధానమంత్రి పథకం అభించిందని చెప్పింది. దీనిని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తన చేతుల మీదుగా బహుకరించడం అమెకు గొప్ప అనుభూతిని మిగిల్చింది. అలాగే శ్రీలంకలో నిర్వహించిన సార్క్‌ దేశాల యువ ప్రతినిధుల సదస్సులో మన దేశం నుంచి యూత్ అఛీవర్ గా వెళ్లంది. రాష్ట్రపతీ, రక్షణశాఖ మంత్రి, ఆర్మీ దళాలతో తేనీటి విందు ఇవన్నీ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని తెలిపింది. అందాల పోటీలలో విజయాన్ని కూడా సాధించాలన్న పట్టుదలతో వుంది. అందుకే ఆ మధ్య జరిగిన యమహా ఫాసినో మిస్‌ దివా-2017 ఆడిషన్స్‌కు వెళ్లానని. అందులో తొలి విడతగా సదరన్‌ మిస్‌ దివా పోటీల్లో పాల్గొన్ని విజేతగా నిలిచానని తెలిపింది. అలానే మిస్ఎర్త్ 2019 గా విజయం సాధించింది. ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు, పిల్లలకు సేవ చేసే అవకాశం దక్కుతుందని తేజస్విని ఆలోచన. ఈ మహబూబ్ నగర్ పట్టణపు అమ్మాయి. అయితే మహబూబ్ నగర్ తన సొంత గ్రామమైనా.. తాను అలనాపాలనా సాగింది మాత్రం రాజధాని హైదరాబాద్ లోనే నని చెప్పిన ఈ సకళ కళా తేజస్వినీ.. తాను పలు రంగాలలో రాణించడానికి కారణం మాత్రం తల్లిదండ్రులు మదన్ మోహన్ శర్మ, అనితలే నని చెబుతుంది. నాన్న బ్యాంకు ఉద్యోగికాగా, తల్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగినని, వారి ప్రోద్భలంతోనే చిన్నప్పటి నుంచే భరతనాట్యం నేర్చుకున్నానని చెబుతుంది. అమ్మ మంచి గాయని కాబట్టి అమె స్వతహాగా పాటలు పాడుతుండటంతో అమె వద్ద సంగీతం నేర్చుకున్నానని.. ఇక పాఠశాల స్థాయిలోనే స్కూల్ లో ఉండగానే నాట్య ప్రదర్శనలు ఇచ్చానని చెబుతుంది. వీటిల్లో ఎక్కువగా సేవా కార్యక్రమాల కోసం చేసినవే. అంటే ఫండ్‌ రైజింగ్‌ కోసమే ప్రదర్శనలు ఇచ్చానని తెలిపింది. అలా ఇప్పటి వరకు 2500 వరకూ ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చింది. అమెరికాలోనూ రెండుసార్లు ఓ సేవా కార్యక్రమం కోసం ప్రదర్శన ఇచ్చింది. పదో తరగతి పూర్తయ్యాక వేసవి సెలవుల్లో యోగాలో డిప్లొమా చేశాను. అప్పుడు తమ గురువు జూనియర్స్ కు తరగతులను తనతో చెప్పించేవారు. ఖాళీ సమయంలో తరగతులు కావాలని అడిగిన వారికీ కూడా శిక్షణ ఇచ్చేదానినని మనోజ్ఞ తెలిపింది. అంతేకాదు.. కొండాపూర్‌లోని 8వ పోలీస్‌ బెటాలియన్‌, యూసుఫ్‌గూడలోని మొదటి పటాలంలో శిక్షణ పొందే పోలీసు సిబ్బందికి ఈ ఏడాది యోగాలో శిక్షణ ఇచ్చానని తెలిపింది. ఏ సమస్యలు ఉన్నవారు ఏ ఆసనాలు వేయాలి వంటివి శాస్త్రబద్దంగా వివరిస్తూ చెప్పడం వల్ల అందరూ నేర్చుకోవడానికి ఇష్టపడేవారని చెబుతుంది ఈ తేజస్వినీ మనోజ్ఞ. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తేజస్విని గురించి తెలుసుకుంటే  ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. తనని సకల కళా శిల్పంలా మలిచి, దేశభక్తి, భారతీయ సంప్రదాయ విలువలు నేర్పిన తన తల్లితండ్రులను తప్పక అభినందించాలి. డాక్టర్ అయినా, ఆర్మీ లో చేరినా, సివిల్స్ కోసం చదువుతున్నా, మిస్ ఎర్త్ లో పాల్గొన్నా తన లక్ష్యం ఎప్పుడూ దేశ సేవ చేయడమే అనే ఈ ముగ్ధకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు (మే 19,1994) తను మరెన్నో విజయాలు సాధించి మరి ఇంకా ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.


Post a Comment

0Comments

Post a Comment (0)