ప్రపంచానికి భారత్‌ ఓ ఆశాదీపం !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన 'యువ శివిర్‌' కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ, యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ  ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ ప్రపంచానికి భారత్‌ ఓ ఆశాదీపంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ఖ్యాతి పెరుగుతుందన్న ఆయన, పురాతన సంప్రదాయాన్ని అనుసరిస్తూ నవ భారత నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. 'కరోనా సంక్షోభం వేళ వ్యాక్సిన్‌లు, ఔషధాలను ప్రపంచ దేశాలకు పంపిణీ చేయడం మొదలు సప్లైచైన్‌ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిన సమయంలోనూ భారత్‌ కీలక పాత్ర పోషించింది. అంతర్జాతీయంగా అశాంతి, ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో శాంతికోసం సమర్థమైన పాత్రను నిర్వహిస్తోన్న భారత్‌.. నేడు ప్రపంచానికి ఓ ఆశాదీపంగా మారింది' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం వేళ వస్తు సరఫరాలో అంతరాయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటితోపాటు యోగా మార్గాన్ని అనుసరించేందుకు ప్రపంచదేశాలకు మనం దారి చూపుతున్నామన్న ఆయన.. ఆయుర్వేద శక్తిని యావత్‌ ప్రపంచానికి తెలియజేస్తున్నామని చెప్పారు. సమిష్టి నిర్ణయాలతో నూతన భారత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో పురాతన సంప్రదాయాన్ని అనుసరించి సరికొత్త విధానంలో ముందుకు వెళ్తున్నామన్న మోదీ.. మొత్తం మానవాళికే దిశానిర్దేశం చేసే శక్తిగా భారత్‌ ఎదుగుతోందని అన్నారు. వడోదర కరేలీబాగ్‌, కుండల్‌ధామ్‌లలోని శ్రీ స్వామినారాయణ్‌ దేవస్థానాలు సంయుక్తంగా 'యువ శివిర్‌' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. సామాజిక సేవ, దేశాభివృద్ధిలో ఎక్కువ మంది యువతను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)