తగ్గనున్న వంటనూనెల ధరలు ?

Telugu Lo Computer
0


ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఇండోనేషియా వంటి దేశాలు పామాయిల్ దిగుమతులపై నిషేధం విధించడం కూడా వంటనూనెల ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది. దీంతో మూడు నెలలుగా దాదాపు కిలో వంట నూనె ధర రూ.70 నుంచి రూ.100 పెరిగింది. అయితే త్వరలోనే వంట నూనెల ధరలు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వంట నూనెల విషయంలో ఇండియా సుమారు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో పామాయిల్ దిగుమతులపై 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకం తగ్గించినా సామాన్యులకు ప్రయోజనం చేకూరలేదు. ఎందుకంటే అదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం, పామాయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో వంటనూనెల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ తగ్గించడం ద్వారా వంట నూనెల ధరలను కాస్త నియంత్రించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సెస్‌ను వ్యవసాయ సంబంధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్ధిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ సెస్ తగ్గింపుపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు పలు ప్రాంతాల్లో వంట నూనెల ప్యాకెట్లకు సంబంధించి పాత స్టా్క్ ఉన్నా వ్యాపారులు పెద్ద ఎత్తున సరుకు మొత్తాన్ని గోడౌన్‌లలో దాచి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దీంతో ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)