ఎయిర్‌ పిస్టల్స్‌, త్రిశూలాలతో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రెయినింగ్

Telugu Lo Computer
0

కర్ణాటకలోని బజరంగ్‌ దళ్‌ శిబిరంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్న ఫొటోలు, వీడియోలు కలకలం రేపాయి. దీంతో కొన్ని రాజకీయ పార్టీలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఆత్మరక్షణ కోసం ఈ మేరకు శిక్షణ ఇస్తున్నట్లు బజరంగ్‌ దళ్‌ పేర్కొంది. శిక్షణకు వినియోగించిన ఎయిర్‌ పిస్టళ్లు, త్రిశూలాలు ఆయుధ చట్టం ఉల్లంఘన కిందకు రావని చెప్పింది.కొడగు జిల్లా పొన్నంపేటలోని సాయిశంకర్ విద్యాసంస్థలో ఈ నెల 5 నుంచి 11 వరకు శౌర్య పరీక్షా శిబిరాన్ని బజరంగ్‌ దళ్‌ నిర్వహించింది. సుమారు 400 మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. వారికి ఎయిర్‌ పిస్టల్స్‌, త్రిశూలాలతో ఆయుధ శిక్షణ ఇచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడగు జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలతో సహా పలువురిపై ఆరోపణలు చేసింది. కర్ణాటకలోని కాంగ్రెస్‌ పార్టీ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలకు ఎందుకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారని ప్రశ్నించింది. ఎలాంటి లైసెన్స్‌ లేకుండా ఆయుధ శిక్షణ ఇవ్వడం నేరం కాదా అని.. బీజేపీ నేతలు దీనిని బహిరంగంగా ఎందుకు సమర్థిస్తున్నారని క్వశ్చన్‌ చేసింది. అలాగే మతం పేరుతో హింసకు పాల్పడేలా శిక్షణ ఇస్తూ యువత జీవితాలను బజరంగ్ దళ్ నాశనం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)