వైసీపీలో భగ్గుమన్న అసంతృప్తి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అధికార వైసీపీలో అసంతృప్త జ్వాలలు రేపింది. పాత కేబినెట్ మొత్తాన్ని రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం నాటికి కొత్త కేబినెట్ జాబితాను ఫైనలైజ్ చేశారు. కొత్త మంత్రుల జాబితాపై మీడియాలో వార్తలు రావడంతోనే దాదాపు అన్ని జిల్లాల్లో కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. తమ ప్రియతమ నేతలకు కేబినెట్ బెర్తు దక్కకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. కొన్ని జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. గుంటూరు జిల్లాలో ఓ మహిళా కార్యకర్త మంటల్లోకి దూకుతానంటూ వీరంగంవేయడం సంచలనం రేపింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత తొలిసారి పార్టీలోనే సీఎం జగన్ నిర్ణయాలపై వ్యతిరేకత బాహాటంగా వ్యక్తమైంది. కొత్త మంత్రివర్గ కూర్పుపై పలు జిల్లాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేబినెట్ లో బెర్తు దక్కని ఎమ్మెల్యేల అనుచరులు రోడ్లపైకొచ్చి నిరసనలు చేశారు. పలు చోట్ల టైర్లను తగులబెట్టి జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ప్రకటనలు చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు రాస్తారోకోలు చేశారు. పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి. రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనగా మండల కేంద్రమైన రెంటచింతల లో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు పై టైయర్లు తగలపెట్టారు. ఈ రాస్తారోకో నిరసన కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం మహిళ నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు మాత్రమే మంత్రి పదవి దక్కింది. కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఎన్టీఆర్‌ జిల్లాలో వైసీపీ నేతలు, కార్యకర్తలు డీలా పడిపడ్డారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే, తాజాగా మంత్రి పదవి కోల్పోయిన మేకతోటి సుచరిత ఏకంగా రాజీనామాకే సిద్దపడినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)