సెప్టిక్ ట్యాంకులో పడి ముగ్గురు కార్మికులు దుర్మరణం

Telugu Lo Computer
0


తమిళనాడులోని మదురైలో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రపరిచే పనిలో నిమగ్నమై ఉన్న ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు విష వాయువు వెలువడి మృతి చెందారు. మదురై కార్పొరేషన్‌లోని 70వ వార్డులోని కార్పొరేషన్‌ మురుగునీటి ట్యాంక్‌లో విద్యుత్‌ మోటారు పాడయింది. దీనితో మురుగునీరు నిలిచిపోవడంతో నలుగురు ఎలక్ట్రికల్ ఇంజినీర్లు విద్యుత్ మోటారును బయటకు తీసి మరమ్మతులు చేసే పనిలో పడ్డారు. ఈ సందర్బంగా విషవాయువు ప్రభావంతో శరవణన్ సెప్టిక్ ట్యాంక్‌లో పడిపోయాడు. శివకుమార్, లక్ష్మణన్ అనే ఇద్దరు కార్మికులు అతడిని రక్షించేందుకు ట్యాంక్‌లోకి దూకడంతో వారు కూడా విష వాయువు బారిన పడ్డారు. బయట నిలబడిన కార్తీక్ అనే కార్మికుడు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది శివకుమార్‌ను రక్షించారు. ఆ సమయంలో 108 అంబులెన్స్‌లు సకాలంలో రాకపోవడంతో ద్విచక్ర వాహనం పై ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంతలో ట్యాంక్‌లో పడిన మరో ఇద్దరు అపస్మారక స్థితిలో పడి చనిపోయారు. సరైన భద్రతా పరికరాలు ఇవ్వకుండానే కార్మికుల చేత పనిచేయిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదం పై విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనీష్ సేగర్ తెలిపారు. విచారణలో అవకతవకలు తేలితే కాంట్రాక్టర్ కాంట్రాక్టును రద్దు చేసి ప్రభుత్వ అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)