'ఒరిజనల్ టెస్లా వాహనం' ఇదే !

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ ఫోటో కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్విట్టర్ లో పలు పోస్టులు చేస్తూ ఆనంద్ మహేంద్రా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అలాంటి పోస్టే ఒకటి షేర్ చేస్తూ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా డ్రైవర్‌తో పనిలేకుండానే దూసుకుపోయే కార్లను ఉత్పత్తి చేస్తోంది. ఈ కార్లకు బోల్డంత సాంకేతిక పరిజ్ఞానం, గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ అవసరం ఉంది. కానీ అటువంటివేమీ అవసరంలేని 'ఒరిజనల్ టెస్లా వాహనం' ఇదేనంటూ ఆనంద్ మహీంద్రా ఓ ఎద్దులబండి ఫొటోను పోస్టు చేశారు. ఆ బండిపై ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు రైతుల మాదిరిగానే ఉన్నారు.బండిని నడిపే రైతు, వెనకనున్న ఇద్దరు కూడా హాయిగా కునుకు తీస్తుండగా, ఎద్దులు మాత్రం గమ్యం దిశగా సాగిపోతున్నాయి. ఈ ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. దీని ఫీచర్లను కూడా వివరించారు. ''ఒరిజినల్ టెస్లా వెహికిల్ ఇదే. దీనికి గూగుల్ మ్యాప్స్‌తో పనిలేదు. ఇంధనం కొనాల్సిన పనిలేదు. పొల్యూషన్ అంతకంటే లేదు. ఇది పూర్తిగా స్వయం చాలక వాహనం'' అని కామెంట్ తగిలించారు. దీనికి కావాల్సిందల్లా ఇల్లు, పనిచేసే ప్రదేశాన్ని అలవాటు చేసుకోవడమే. ఆ తర్వాత ఎంచక్కా బండెక్కి ఓ కునుకు తీసినా గమ్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పుకొచ్చారు ఆనంద్ మహేంద్రా. అంతేకాదు, ఈ ట్వీట్‌పై రియాక్షన్ కోరుతూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)