నైరుతి రైల్వేజోన్‌ లో వారంపాటు రైళ్ల రాకపోకలలో అంతరాయం

Telugu Lo Computer
0




నైరుతి రైల్వేజోన్‌ పరిధిలో కెపాసిటి, సేఫ్టీని పెంచుకునే దిశలో అనేక కార్యక్రమాలు కొనసాగుతున్న కారణంగా రానున్న వారం రోజులపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని నైరుతి రైల్వే ప్రయాణికుల సదుపాయాల విభాగం కమర్షియల్‌ మేనేజర్‌ డాక్టర్‌ అనూప్‌ దయానంద్‌ సాధు బుధవారం మీడియాకు తెలిపారు. యలహంక - హిందూపురం - పెనుకొండ, హొసదుర్గ - చిక్కజాజూరు, అల్నావర - అంబేవాడి, యళవిగి - సవనూరు, గదగ్‌ - హొలె ఆలూరు తదితర మార్గాలలో విద్యుద్దీకరణ పనులు, జంటరైలు మార్గాల పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ఈ కారణంగా పది రైళ్లను రద్దు చేయడంతోపాటు మరో 14 రైళ్లను మళ్లించామన్నారు. ఈ అంశాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. ఇప్పటికే టికెట్లు రిజర్వు చేసుకున్నవారికి మొత్తాలను వాపసు చేస్తున్నామన్నారు. ఈనెల 29 వరకు బెంగళూరు - కంటోన్మెంట్‌ మెము రైలుతోపాటు డైలీ ప్యాసింజర్‌ రైలు, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లను రద్దు చేశామన్నారు. కాగా ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ బెంగళూరు సెంట్రల్‌ స్టేషన్‌ నుంచే ప్రయాణిస్తుందన్నారు. అనేక రైళ్ల మార్గాలను మళ్లించామన్నారు. ఈ సమాచారాన్ని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రకటన బోర్డులపై అందుబాటులో ఉంచామన్నారు. ఏఏ రైళ్లు రద్దు అయినది, ఏఏ రైళ్లు దారి మళ్లేవి తెలుసుకునేందుకు రైల్వే కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చునన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)