ఉక్రెయిన్‌కు బ్రిజేంద్ర రానా రూ. 40 కోట్ల సాయం

Telugu Lo Computer
0


రష్యా దాడితో ఉక్రెయిన్ దేశం అతలాకుతలం అవుతోంది. అక్కడి ప్రజలు కనీస అవసరాలు
అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రిజేంద్ర రానా అనే వ్యాపారి ఉక్రెయిన్‌కు తన వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.40 కోట్లు విలువైన వైద్య పరికరాలు, ఉత్పత్తులను ఉక్రెయిన్​దేశానికి ఉచితంగా అందించారు. 1992లో ఉక్రెయిన్‌కు వెళ్లిన బ్రిజేంద్ర రానా అక్కడి ఖార్కీవ్ నగరంలోనే వైద్య విద్యను అభ్యసించారు. చదువు పూర్తయిన తర్వాత అక్కడే స్నేహితులతో కలిసి ఫార్మాసుటికల్ కంపెనీని కూడా స్థాపించారు. అనంత మెడికేర్ పేరుతో ఫార్మా కంపెనీని ఆయన ప్రారంభించగా అతి తక్కువ కాలంలోనే లాభాలను ఆర్జించింది. మెడికేర్ కంపెనీ ద్వారా బ్రిజేంద్ర రానా తాను చదువుకున్న ఉక్రెయిన్ దేశానికి సాయం అందిస్తున్నారు. తన కంపెనీ ఔషధాలతో వందలాది మంది ప్రాణాలను కాపాడుతున్నారు. మూడు దశాబ్దాల నుంచి ఖార్కీవ్‌లో ఉంటున్న బ్రిజేంద్ర రానాకు భార్య, ఓ కూతురు ఉన్నారు. వీరిద్దరినీ ఇండియాకు సురక్షితంగా పంపించాలని ఆయన భావించారు. ఉక్రెయిన్ నుంచి రొమేనియా సరిహద్దుకు ఇద్దరినీ తరలించారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ భారత్‌కు చేరుకోలేకపోయారు. అయినా బ్రిజేంద్ర రానా మాత్రం ఉక్రెయిన్‌ను వీడేందుకు ఇష్టపడలేదు. ప్రస్తుతం ఆయన యుద్ధప్రభావం తక్కువగా ఉన్న పశ్చిమ ఉక్రెయిన్‌లో ఉంటున్నారు. భారత్‌లో ఉన్న తమ బంధువులు వెనక్కి వచ్చేయాలని రానాపై ఒత్తిడి చేస్తున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆయన ఉక్రెయిన్‌ను సొంత దేశంలా భావిస్తూ అక్కడే ఉండి పోరాడుతున్నారు. దీంతో పలువురు బ్రిజేంద్ర రానా తెగువను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి బ్రిజేంద్ర రానా స్వచ్ఛంద సేవ చేయడంలోనే నిమగ్నమయ్యారని ఆయన అల్లుడు నవీన్ రానా వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)