ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి బ్యాటరీల చోరీ !

Telugu Lo Computer
0


ట్రాఫిక్‌ సిగ్నల్‌ నుంచి బ్యాటరీని దొంగిలించి స్క్రాప్‌ డీలర్‌లకు విక్రయించిన దంపతులను బెంగళూరులోని అశోక్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సికందర్ (30), నజ్మా (29) బెంగళూరు సబర్బన్ ప్రాంతం చిక్కబాణవర ప్రాంతంలో ఉంటున్నారు. ఈ భార్యాభర్తలు త్వరగా డబ్బు సంపాదించేందుకు ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి బ్యాటరీలను దొంగిలించేవారు. వారి నుంచి 230 బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికందర్ టౌన్‌షిప్ ప్రాంతంలో టీ విక్రయిస్తుంటాడు. అతని భార్య నజ్మా క్లాత్ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. సికందర్ ఒకరోజు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తెరిచిన బ్యాటరీ పెట్టెను చూసి, దాని నుండి బ్యాటరీని తీసి దాసరహళ్లిలోని స్క్రాప్ డీలర్ వద్దకు తీసుకెళ్లాడు. స్క్రాప్ డీలర్ సికిందర్‌కు బ్యాటరీకి  రూ.2,000 ఇచ్చాడు. అప్పటి నుంచి సికిందర్ తన భార్య నజ్మాతో కలిసి ట్రాఫిక్ సిగ్నల్‌లో ఉన్న బ్యాటరీని దొంగిలించి స్క్రాప్‌లో అమ్మడం తన వ్యాపారంగా చేసుకున్నాడు. ఇద్దరూ తమ స్కూటర్ తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య నగరంలో తిరుగుతూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న బ్యాటరీని దొంగిలించేవారు. సీసీటీవీలో స్కూటర్ నంబర్ క్యాప్చర్ కాకుండా ఉండేందుకు బ్యాక్ లైట్ వేయకుండా జాగ్రత్త పడేవారు. ఇద్దరూ జూన్ 2021లో ట్రాఫిక్ సిగ్నల్ నుండి బ్యాటరీని దొంగిలించడం ప్రారంభించారు. బెంగళూరులోని వివిధ పోలీస్ స్టేషన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ నుండి బ్యాటరీ చోరీకి సంబంధించి 68 కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలలుగా ఈ ఘటనకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాటరీ దొంగిలించబడిన తరువాత పోలీసులు ఆధారాలు సేకరించడం ప్రారంభించారు. బ్యాటరీ చోరీకి గురైన ప్రాంతాలన్నింటిని పోలీసులు తమ బృందంతో కలిసి సందర్శించారు. వందలాది సిగ్నల్స్ వద్ద అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని స్కాన్ చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య ఓ జంట స్కూటర్‌పై అనుమానాస్పదంగా వెళుతున్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు గుర్తించారు. దంపతులు గొరగుంటెపాళ్యం వైపు వెళ్లినట్లు పోలీసు బృందానికి తెలిసింది. అయితే కెమెరాలను తప్పించుకునేందుకు దంపతులు టెయిల్ ల్యాంప్ కనెక్షన్‌ని స్విచ్ ఆఫ్ చేయడంతో వారి స్కూటర్ నంబర్ సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించలేదు. ఆ తర్వాత పోలీసులు ఆర్టీఓ నుంచి దంపతుల స్కూటర్ లాగా ఉన్న 4000 స్కూటర్ల వివరాలను సేకరించారు. దాదాపు 300 మందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దీంతో కొద్దిరోజులుగా గొరగుంటెపాళ్యం జంక్షన్‌లో బృందం విడిది చేసింది. చివరకు 9 ఫిబ్రవరి 2022న పోలీసులు సికందర్ మరియు నజ్మాలను పట్టుకోగలిగారు. నేరం సమయంలో ఈ జంట ఎప్పుడూ మొబైల్ ఫోన్ ఉపయోగించలేదు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ నుంచి దొంగిలించిన బ్యాటరీలను స్క్రాప్‌గా మార్చి నాలుగు చక్రాల వాహనాలు, కర్మాగారాల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు. సికందర్‌ను 2017, 2018లో ద్విచక్రవాహనాన్ని దొంగిలించిన కేసులో ఉప్పర్‌పేట, జేజే నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)