మదనపల్లె - తిరుపతి ఫోర్‌లేన్‌కు నిధులు మంజూరు

Telugu Lo Computer
0


జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె- తిరుపతి ఫోర్‌లేన్‌కు కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారత్‌మాల పరియోజన పథకం కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఈ నిధులతో ఎన్‌హెచ్‌-71లో తొలివిడతగా మదనపల్లె- పీలేరు మధ్య 55.9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. తిరుపతి- మదనపల్లె ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఘాట్‌రోడ్డుతో ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల ప్రజలు తిరుపతికి వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. ఈ క్రమంలో ఈ రోడ్డును ఫోర్‌లేన్‌గా మారిస్తే సౌకర్యంగా ఉంటుందని సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి విన్నవించారు. ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకునే క్రమంలో మిథున్‌రెడ్డి ఎన్‌హెచ్‌-71ను నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలోకి మార్పించారు. అలాగే మార్గం మధ్యలో వచ్చే రైల్వే గేట్లకు సంబంధించి ఆర్‌ఓబీలు నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేయించారు. కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని పలుమార్లు కలిసి మీడియం ప్రయారిటీలో ఉన్న ఈ ప్రాజెక్టును హై ప్రయారిటీ జోన్‌లో చేర్పించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎంపీ మిథున్‌రెడ్డి చేసిన కృషి నేడు ఫలిస్తోంది. మదనపల్లె- చెర్లోపల్లె (తిరుపతి) జాతీయ రహదారిని మొత్తం 103 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయించారు. తొలివిడతగా మదనపల్లె- పీలేరు మధ్య 55.9 కిలోమీటర్ల నిర్మాణానికి ప్రస్తుతం రూ.1,852.12 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. హైబ్రీడ్‌ యాన్యుటీ మోడ్‌ (హెచ్‌ఏఎం) విధానంలో 40శాతం నిధులను కేంద్రప్రభుత్వం ఐదు విడతలుగా విడుదల చేయనుంది. మిగిలిన 60 శాతం నిధులను డెవలపర్‌ వెచ్చించుకోవాల్సి ఉంటుంది. డెవలప్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఓటీ) కింద ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)