మహిళల చిత్రాలు ఆన్‌లైన్‌లో అమ్మకానికి...!

Telugu Lo Computer
0


నూతన సంవత్సర ఆరంభం రోజునే మహిళల ఆత్మగౌరవాన్ని ఆన్‌లైన్‌ వేలంలో పెట్టిన అకృత్యం వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వంద మందికిపైగా ముస్లిం మహిళల చిత్రాలను అభ్యంతరకర రీతిలో మార్చి ఓ యాప్‌లో వేలానికి ఉంచిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. 'బుల్లీ బయ్‌' పేరుతో ఉన్న ఆ యాప్‌లో తన ఫొటోను అమ్మకానికి ఉంచారంటూ ఓ ముస్లిం పాత్రికేయురాలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వెల్లడించడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. దీనిపై ఆమె ఢిల్లీ  సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ముంబయి పోలీసులు కూడా దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రజలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆ యాప్‌నకు హోస్టింగ్‌ సేవలు అందిస్తున్న గిట్‌హబ్‌ సంస్థ దాన్ని శనివారం ఉదయమే బ్లాక్‌ చేసిందని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ(ఐటీ) మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీసులు, కంప్యూటర్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఆర్‌ఈటీ) సంయుక్త దర్యాప్తు చేపట్టాయని ఆదివారం పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని, సంబంధిత సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా తమకు తెలియజేయాలని జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రేఖాశర్మ దిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. తద్వారా ఈ తరహా నేరం మరోటి జరగకుండా చూడాలన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)