ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా

Telugu Lo Computer
0


ఎన్టీఆర్‌, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కలిసి నటించిన చిత్రం కావడంతో ట్రిపుల్ ఆర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల పరిస్థితులు అన్నీ చక్కబడటంతో ట్రిపుల్ ఆర్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయాలనుకున్నారు. ఒమిక్రాన్ కేసులు మళ్లీ  పెరుగుతుండటంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడక తప్పలేదు. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలు తాజాగా కన్ఫార్మ్ చేశాడు. కరోనా కారణంగా చాలా కాలం థియేటర్లు మూతబడ్డాయి. ఆ తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ జనాలు రావడానికి అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. కానీ చతికిలబడ్డ థియేటర్లకు అఖండ సినిమా ఊపిరిపోసింది. మంచి సినిమా వస్తే జనాలు థియేటర్లకు వస్తారని ఈ సినిమా కలెక్షన్లు నిరూపించాయి. ఆ తర్వాత వచ్చిన పుష్ప సినిమాతో థియేటర్ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిలబెట్టింది. దీంతో పెద్ద సినిమాల నిర్మాతలు ఒక్కొక్కరుగా తమ సినిమాల రిలీజ్ డేట్లను అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ అంతలోనే మళ్లీ ఒమిక్రాన్‌, కరోనా కేసులు పెరుగుతుండటం కలవరం పుట్టిస్తోంది. మెల్లమెల్లగా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధించారు. నైట్ కర్ఫ్యూతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు రన్ చేయాలని నిబంధన విధించారు. దీంతో డిసెంబర్ 31న విడుదల కావాల్సిన జెర్సీ రీమేక్ వాయిదా పడింది. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలు కూడా వాయిదా పడుతాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ రాధే శ్యామ్ చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. తమ సినిమాను అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తామని ప్రకటించింది. కానీ ట్రిపుల్ ఆర్ నిర్మాతలు మాత్రం వెనక్కి తగ్గారు. తమ సినిమాను వాయిదా వేస్తున్నామని  ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)